జగన్ చెప్పినట్లే జరిగింది.. బటన్ నొక్కిన 6 నిమిషాల్లో వెళ్లి సేవ్

Update: 2021-07-24 03:24 GMT
అక్కచెల్లెళ్లకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా మరోసారి రుజువైంది. ఏపీ సర్కారు ఈ మధ్యన తీసుకొచ్చిన దిశ యాప్ తో రక్షణ కల్పించనున్నట్లు చెప్పే మాట అక్షర నిజంగా మారింది. పోకిరీ వేధింపునకు గురై.. రక్షణ కోసం దిశ యాప్ బటన్ ను నొక్కిన ఆరు నిమిషాల్లోనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమెకు రక్షణ కవచంలా మారిన వైనం ఆసక్తికరంగా మారింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

విజయవాడలోని సత్యనారాయణపురంలోని దేవీ నగర్ కు చెందిన పందొమ్మిదేళ్ల యువతి స్థానిక కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న ఆకాష్ ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినని పరిస్థితి. దీంతో తండ్రికి.. కళాశాల ప్రిన్సిపల్ కు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో..వారు యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ తాను ప్రేమిస్తున్నానని.. తనను ప్రేమించాలంటూ అదే పనిగా ఒత్తిడి చేయసాగాడు.

ఇదిలా ఉండగా శుక్రవారం కాలేజీలో ఎగ్జామ్ రాసిన బాధితురాలు.. తండ్రితో కలిసి టూ వీలర్ మీద ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో ఆకాశ్ బండి మీద వెళుతూ.. ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో.. భయపడిపోయిన ఆమె దిశ యాప్ లోని ఎస్ వోఎస్ బటన్ ను నొక్కింది. మధ్యాహ్్నం 12.31 గంటలకు దిశ కాల్ సెంటర్ కు సమాచారం అందిన ఆరు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందించి.. యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి 12.37 గంటలకు చేరుకున్నారు.

వెంటనే బాధిత యువతి వద్దకు చేరుకున్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీసులు.. ఆమె ఫిర్యాదు మేరకు ఆకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపైన 483, 354డి, 506 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన దిశ ఉదంతం నేపథ్యంలో.. ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ యాప్ ను తీసుకొచ్చారు. ఇందులో ఉండే ఎస్ వోఎస్ బటన్ నొక్కిన ఆరు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే ఫీచర్ ను ఏర్పాటు చేసి.. ఆడబిడ్డలకు అండగా పోలీసులు నిలుస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాట అక్షర సత్యమన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమైంది.

వేధింపులకు గురవుతున్న బాధితురాలు సాయం కోసం ఆర్థించిన నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించిన వైనంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. వేధింపులకు చెక్ పెట్టటమే కాదు.. ఆకతాయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా దిశ యాప్ పని చేస్తుందన్న విషయం తాజాగా మరోసారి రుజువైందని చెప్పాలి.


Tags:    

Similar News