ఈటల ఎపిసోడ్ లో కేసీఆర్ టీంను డిఫెన్సులో పడేసిన అతి పెద్ద పొరపాటు

Update: 2021-05-05 14:30 GMT
పాతికేళ్ల క్రితం.. పొంగల్ కు భారీ అంచనాలతో విడుదలైన మణిరత్నం డబ్బింగ్ మూవీ ‘‘ఇద్దరు’’. తమిళంలో ఇరువర్ గా విడుదలైంది. సినిమా.. రాజకీయాల కలబోతగా ఉండే ఈ చిత్రం ఎంజీఆర్.. కరుణల కథగా చెబుతారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకుడిగా.. నిర్మాతగానే కాదు.. సహరచయితగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. సంక్రాంతి వేళలో సినిమా విడుదల కావటం.. మణిరత్నం మూవీ అంటే జనాలు భారీ ఎత్తున వస్తారు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టేంత మాత్రమే థియేటర్ వచ్చిన దుస్థితి. అంత దారుణంగా ఫెయిల్ అయిన ఈ సినిమా నిజంగా అంత చెత్తగా ఉంటుందా? అంటే.. డబ్బింగ్ సరిగా లేకపోవటం.. సినిమా స్లోగా ఉండటం (నిడివి 2.45గంటలు) తెలుగువారు కనెక్టు అయ్యే అంశాలు తక్కువగా ఉండటం సినిమా ఎవరిని ఆకర్షించలేదు.

ఇంతకూ ఆ సినిమా ప్రస్తావన తేవటానికి కారణం లేకపోలేదు. ఎంజీఆర్ గా మోహన్ లాల్.. కరుణానిధిగా ప్రకాశ్ రాజ్ పాత్రలు పోషించారు. ఇరువురి మధ్య మొదలైన స్నేహం.. కాలక్రమంలో బద్ధ విరోధులుగా మారటం.. రాజకీయ వైరం వారి మధ్య మరింత దూరాన్ని పెంచుతుంది. అలాంటి సమయంలో అనూహ్యంగా ఎంజీఆర్ మరణించటం.. ఆయన అంతిమ సంస్కారాలకు వచ్చిన సమయంలో.. విపరీతంగా వేదన చెందుతాడు. రాజకీయంగా తనకు విరోధి కావొచ్చు.. వ్యక్తిగతంగా తనకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు. అలాంటి సన్నిహితుడు.. తనకంటే చిన్న వయసులో మరణించటాన్ని తట్టుకోకపోయినట్లుగా సినిమాలో చూపిస్తారు. ఈ సీన్ చాలామందిని ఆకర్షిస్తుంది.

రాజకీయాల్లో ఉండాల్సిన నైతిక విలువలకు సంబంధించిన అంశాన్ని ఎంత సింఫుల్ గా చెప్పాశారా? అన్న భావన కలుగుతుంది. ఇప్పుడు నడుస్తున్న కక్ష పూరిత రాజకీయాల్లో అలాంటివి ఆశించటం అత్యాశే అవుతుంది. కొత్త తరం రాజకీయ నేతల నుంచి ఇలాంటివి ఆశించలేం సరే.. పాతతరం నేతల విషయంలో అయినా ఇలాంటివి కాసిన్ని అయినా ఉంటే బాగుండేది కదా? బ్యాడ్ లక్ అలాంటివేమీ లేకపోవటం. తాజాగా ఈటెల ఎపిసోడ్ ను చూస్తే.. ఆయనపై సీఎం కేసీఆర్ కత్తి కట్టారన్నది బహిరంగ రహస్యం.

ఈటల సతీమణి జమున పేరుతో ఉన్న కోళ్ల ఫారం అసైన్డ్ భూమిగా కలెక్టర్ నివేదిక తేల్చటం ఓకే.  ముఖ్యమంత్రి స్వయంగా అప్పగించిన వ్యవహారం కావటంతో వాయు వేగంతో రిపోర్టు తయారు చేసిన కలెక్టర్.. చేయకూడని దారుణ తప్పు ఒకటి చేశారు.  కలెక్టర్ రూపొందించిన నివేదికలో జమున (ఈటల రాజేందర్ సతీమణి)ని నితిన్ రెడ్డి (కొడుకు) భార్యగా పేర్కొన్నారు. తల్లిని భార్యగా పేర్కొంటూ కలెక్టర్ ఇచ్చిన నివేదికపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో రాజేందర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. వావివరసలు తెలీవా? అంటూ కడిగేశారు. హైకోర్టు సైతం.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘తల్లిని భార్యగా చెప్పారంటే వాస్తవాల్ని ధ్రువీకరించుకోకుండా ఎంత హడావుడిగా నివేదిక ఇచ్చారో అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. మిగిలిన తప్పుల్ని పక్కన పెడితే.. ఇలాంటి తప్పులకు కారణమైన వారిపై చర్యలు.. ఇలాంటి తప్పునకు క్షమించాలని కోరటం సముచితం. మరీ.. ఎక్కువ ఆశిస్తున్నామా?
Tags:    

Similar News