న‌డిపించేందుకు న‌డ్డా వస్తున్నారా?

Update: 2022-01-03 12:30 GMT
దేశంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలా గ‌ద్దెనెక్కాలి అనే విష‌యంపై బీజేపీ ఎప్పుడూ స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే ఉంటుంది. ఏ మాత్రం చిన్న అవ‌కాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకుని అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తుంది. ఇప్పుడు తెలంగాణ‌పైనా బీజేపీ అధిష్ఠానం ప్ర‌త్యేక దృష్టి సారించ‌డానికి కార‌ణ‌మ‌దేన‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు. అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ సై అంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ జోరు మీద క‌నిపిస్తోంది.

తెలంగాణ‌లో త‌మ‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భావించిన బీజేపీ ఇక్క‌డి రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇక్క‌డి బీజేపీ ఎంపీలు, నాయ‌కుల‌తో వేర్వేరుగా స‌మావేశ‌య్యారు. వాళ్ల‌కు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడిక బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హైద‌రాబాద్‌కు రానున్నారు.

పార్టీ బ‌లోపేతం కోసం రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్‌) స‌హ‌కారం కూడా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అందులో భాగంగా ఆరెస్సెస్ జాతీయ స‌మావేశాల కోసం జేపీ న‌డ్డా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్కు రాబోతుండ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మూడు రోజులో పాటు జ‌రిగే ఈ ఆరెస్సెస్ స‌మావేశాల‌ను జాతీయ స్థాయి నాయ‌కులు హాజ‌రు కానున్నారు. అయితే ఈ స‌మావేశాల కోసం భాగ్య‌న‌గ‌రానికి రానున్న న‌డ్డా ఇక్క‌డి పార్టీ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం. ఆయ‌న‌కు ఘ‌న స్వాగతం ప‌ల‌క‌డంతో పాటు స‌మీక్ష అజెండాను తెలంగాణ బీజేపీ నాయ‌కులు సిద్ధం చేసుకున్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కోసం నాయ‌కులు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న‌కు వివ‌రిస్తార‌ని టాక్‌. కేసీఆర్ ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌.. బీజేపీకి పెరుగుతున్న బ‌లం గురించి చ‌ర్చిస్తార‌ని స‌మాచారం. అలాగే ఈ స‌మీక్ష‌ల‌నే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌లి విడ‌త పాద‌యాత్ర షెడ్యూల్‌ను ఖ‌రారు చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కోసం స్థానిక నాయ‌కుల‌కు న‌డ్డా సూచ‌న‌లు చేస్తార‌ని స‌మాచారం.


Tags:    

Similar News