‘మా వాళ్లు కొడితే.. కట్టుకోవటానికి బ్యాండేజీలు సరిపోవు’

Update: 2020-12-27 04:45 GMT
రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందునా రాజకీయ వైరం రాజుకుంటే.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పశ్చిమబెంగాల్ రాజకీయాలు నిలువెత్తు నిదర్శనం. దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆ రాష్ట్ర రాజకీయాలు సాగుతుంటాయి. మరికొద్ది నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీని ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి విజయం సాధించిన హ్యాట్రిక్ కొట్టాలని అధికార టీఎంసీ భావిస్తుంటే.. బెంగాల్ కోటలో ఈసారి పాగా వేయాల్సిందేనని బీజేపీ భావిస్తోంది.

ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎత్తులు.. పైఎత్తులతో బెంగాల్ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో మమత పార్టీతో అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది.

దీనికి తగ్గట్లే.. దేనికైనా రెఢీ అన్నట్లుగా వారి తీరు మారింది. తాజాగా బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. తమ పార్టీ కార్యకర్తలు చేతులు.. కాళ్లు వాడాల్సి వస్తే.. ఆ పార్టీ మద్దతుదారులు కట్టుకోవటానికి బ్యాండేజీలు కూడా సరిపోవన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు సాగాలని భావిస్తున్నామని.. తమను రెచ్చగొట్టాలని భావిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

నాలుగైదు నెలల్లో ముఖ్యమంత్రి కుర్చీలో బీజేపీ నేత కూర్చోవటం ఖాయమన్న ఆయన.. తృణమూల్ పై తీవ్ర వ్యాఖ్యలు తరచూ చేస్తుంటారు. మమత మద్దతుదారులు తమ పద్దతి మార్చుకోకపోతే.. ఆసుపత్రి లేదంటే స్మశానవాటికకు వెళ్లాల్సి వస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. మొత్తంగా చూస్తే.. బెంగాల్ ఎన్నికలు సాదాసీదాగా జరిగే అవకాశం కనిపించటం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News