విమాన ప్రమాదం జరిగితే... బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం

Update: 2020-08-08 23:30 GMT
విమాన ప్రమాదాలు జరిగినప్పుడు విచారణలో బ్లాక్ బాక్స్ ఎంతో కీలకం. ఇవి ప్రమాదాలకు సంబంధించిన వివరాలను బయటపెడతాయి. విచారణలో దర్యాఫ్తు బృందానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. విమాన ప్రమాదాలు జరిగితే తొలుత బ్లాక్‌బాక్స్‌లో ఏం జరిగిందో తేలుతుంది అనేది అందరి నోట వినిపించే మాట! నిన్న కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలోను బ్లాక్ బాక్స్ కీలకం కానున్నాయి. అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?

బ్లాక్ బాక్స్ నారింజ రంగులో ఉంటాయి. విమానం టేకాఫ్ తర్వాత కాక్‌పిట్‌లో చోటు చేసుకునే ప్రతి సంభాషణ నిక్షిప్తమై ఉంటుంది. విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికి అప్పుడు ఇందులో రికార్డ్ అవుతుంది. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే ఏం జరిగిందో బ్లాక్ బాక్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. దీని ఆధారంగానే అధికారులు దర్యాఫ్తు చేస్తారు. బ్లాక్ బాక్స్‌లో పదమూడు గంటల నిడివి గల డేటా నిక్షిప్తమై ఉంటుంది.

ఈ బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ వేయడానికి కూడా కారణం ఉంది. ఒకవేళ మంటలు చెలరేగి అన్నీ కాలిపోతే నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణంలోను దృఢంగా ఉండేలా ఈ బ్లాక్ బాక్స్‌ను డిజైన్ చేస్తారు. ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. నీటిలో మునిగినా డేటా ధ్వంసం కాదు. రాడర్ సిగ్నల్స్ అందకపోయినప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పని చేస్తాయి. విమానం వెనుక భాగం సురక్షితంగా భావించి, ఈ బ్లాక్ బాక్స్‌ను అక్కడే అమరుస్తారు. ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ తప్పనిసరి అనేది విమానయాన రంగం చట్టంలో రూపొందించారు.

బ్లాక్ బాక్స్‌లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డ్. రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డ్. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఎంత వేగంతో ఉంది, ఎంత ఇంధనం ఉంది, ఇంజిన్ థ్రస్ట్ వంటి సమాచారాన్ని ఫ్లయిట్ డేటా రికార్డ్‌లో నమోదయి ఉంటాయి. విమానంలోని ప్రతి కదలికను నమోదు చేస్తుంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డ్‌లో కాక్‌పిట్‌లో జరిగే ప్రతి సంభాషణ రికార్డయి ఉంటుంది. పైలట్ల సంభాషణ, ఏటీసీతో పైలట్ల సంభాషణ.. ఇలా అన్నీ రికార్డ్ అవుతాయి. పైలట్ సమస్యను ఎదుర్కొన్నారు, ఏటీసీకి తెలిపారా, ప్రమాదం ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగింది వంటి విషయాలను కాక్ పిట్ వాయిస్ రికార్డర్ నమోదు చేస్తుంది. దీని ఆధారంగానే ప్రమాదం ఎలా జరిగిందో విచారణాధికారులు తెలుసుకోవడానికి సులభం అవుతుంది. ఇవన్నీ కూడా మెటల్ బ్లాక్‌లోని మెమోరీ బోర్డుపై స్టోర్ అవుతాయి. ప్రమాదం జరిగితే వీటిని డీకోడ్ చేస్తారు.
Tags:    

Similar News