భైంసా అల్లర్లకు కారణం ఆ కార్యకర్తలేనట .. ఎవరంటే ?

Update: 2021-03-17 07:30 GMT
నిర్మల్ జిల్లాలోని భైంసాలో మార్చి 7వ తేదీన అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. దీంతో జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్ ‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే, కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి.

ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు.  పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో బైంసాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇక, భైంసాలో డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఇన్‌ ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇక, గతేడాది కూడా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటనలపై  మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి మాట్లాడారు.. ‘ఈనెల 7వ తేదీన రాత్రి 8.20 గంటలకు గొడవ మొదలైంది.. అందులో ప్రధానంగా హిందూవాహినికి చెందిన తోట మహేశ్, దత్తు పటేల్‌ అనే ఇద్దరు బైకుపై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్‌ అతని మిత్రులు సమీర్, మిరాజ్ ‌లను వెనక నుంచి తలపై కొట్టారు. కోపంతో ఈ ముగ్గురు మహేశ్‌ ను వెంబడిస్తూ బట్టీ గల్లీలోకి వెళ్లి వెదకడం ప్రారంభించారు అన్నారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురిపై దత్తు, మహేశ్‌.. రాకేశ్, గోకుల్‌తో కలసి దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మద్యం కొనేందుకు దత్తు బైక్‌పై జుల్ఫికర్‌ మసీద్‌ ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో మరో వర్గం ఎదురుపడటంతో మళ్లీ ఘర్షణ మొదలైంది అని అన్నారు. అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు.  అప్పుడే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Tags:    

Similar News