నెలనెలా దోపిడీనే.. పెట్రోమంటలాగానే జనానికి 'కరెంట్' షాక్ ఇస్తున్న మోడీ సార్..

Update: 2023-01-04 09:35 GMT
2014లో అధికారంలోకి రాకముందు మోదీ చెప్పిన హామీలకు.. ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ప్రజల అభివృద్ధికి పాటుపడుతామని చెప్పిన మోదీ.. వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. ప్రజలకు నష్టం చేకూర్చే కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతూ వారి విమర్శలకు కారణమవుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఇప్పుడు తాజాగా 'కరెంట్' రూపంలో షాక్ ఇస్తున్నారు. తాజాగా నెల నెలా కరెంట్ చార్జీలు సవరణ చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అంటే పెట్రోల్ రేటు లాగానే.. ఇప్పుడు విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతాయన్నమాట. దీంతో మోదీ తమపై ఇంకెన్ని బండలు వేస్తాడోనని సగటు భారతీయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

విద్యుత్ చార్జీల నిబంధలను కేంద్రం తాజాగా మార్చింది. విద్యుదుత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు, విద్యుత్ కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్ గా వినియోగదారుడిపై వేసేలా విద్యుత్ కమిషన్ ఒక ఫార్మూలా రూపొందించాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది.

ఇందులో భాగంగా విద్యుత్ నిబంధనలు -2005ను సవించాలని తెలిపింది. వీటి స్థానంలో కొత్త నిబంధలను తీసుకురావాలని పేర్కొంది. ఈ ప్రక్రియ 90 రోజుల్లో పూర్తి కావాలని తెలిపింది. అయితే విద్యుత్ కొత్త నిబంధనలను అమలయ్యే వరకు ఈ నిబంధనల్లో ఉన్న విధానాన్ని అనుసరించాలని తెలిపింది.

అంటే ఇప్పుడు వినియోగదారుడు విద్యుత్ ను వినియోగించినా.. లేకపోయినా అదనంగా చార్జీని చెల్లించాలన్నమాట. పెట్రోల్ ధరలు అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందని చెప్పిన మోదీ.. ఇంతకాలం వాటిలో ఎలాంటి మార్పులు రాలేదా..?అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ.10 వరకు పెట్రోల్ రేటును తగ్గించారు. కానీ మళ్లీ పెంచుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో గెలవడానికేనా..? అని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు విద్యుత్ చార్జీల పేరిట వినియోగదారుని నెత్తిన బండ వేయనున్నారు. ఇంధన చార్జీలు పెరిగితే ఆ భారాన్ని వినియోగదారుడిపై వేయాలంటున్నారు. అంటే ఇప్పుడు సామాన్యులు ఓ వైపు పెట్రోల్ ధరల భారాన్ని.. ఇటు విద్యుత్ చార్జీల అధిక భారాన్నీ మోయాలన్నమాట. ప్రజల సంక్షేమం అని చెబుతున్న మోదీ  ఇలా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడికి చిప్ప గతే ఉంటుందని ప్రతిపక్ష రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ వచ్చే ఎన్నికల్లో  ప్రజల నుంచి ఎలాంటి అనుభవాలు ఎదుర్కుంటారో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News