ఎయిర్ ఇండియా : ఈ ఏడాదే ప్రైవేట్ చేతుల్లోకి !

Update: 2020-08-31 11:10 GMT
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏకైక పౌర విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రక్రియలో కేంద్రం స్పీడ్ పెంచింది. ఎయిర్ ఇండియా అమ్మకాలను ప్రక్రియను ఈ ఏడాదిలోగా చుట్టబెట్టేయడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ ఏడాదిలోనే ఎయిరిండియాను ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంది. విమానాలు, విమానాశ్రయాలను నడిపించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ఇప్పటికే చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి సన్నాహాలు ప్రారంభించింది.

ఎయిర్ ఇండియా దేశానికి ఓ పెద్ద అస్సెట్ అని, అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందనీ పౌర విమానయాన శాఖ మంత్రి హర్ ‌దీప్ సింగ్ పురి తెలిపారు. క్రమశిక్షణ, నైపుణ్యం గల మానవ వనరులు ఎయిర్ ఇండియా కు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ.. దాన్ని నడపలేమని స్పష్టం చేశారు. ఎయిరిండియాను విక్రయించడానికి మంచి ధర కోసం చూస్తున్నామని వెల్లడించారు. బిడ్డింగులను దాఖలు చేసే వారు అట్రాక్టివ్ రేట్లతో ముందుకు వస్తే.. తప్పకుండా ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తామని హర్‌దీప్ సింగ్ పురి తేటతెల్లం చేశారు. ఎయిరిండియాను అమ్మకానికి ఉద్దేశించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్ గడువును కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పొడిగించింది. అక్టోబర్ 30వ తేదీ వరకు గడువును పెంచింది. ఆగస్టు 31వ తేదీ నాటికి దీన్ని ముగించేయాల్సి ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేర బిడ్డింగులేవీ దాఖలు కాకపోవడంతో మళ్లీ డేట్ పొడిగించింది.

ఏ పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరి నాటికి ఎయిరిండియాను అమ్మేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం హర్‌ దీప్ సింగ్ పురి చేసిన తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. విమానాలు, విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి బీజం వేసింది తాము కాదని హర్‌ దీప్ సింగ్ పురి వెల్లడించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే దానికి తెర తీసిందని అన్నారు. ముంబై లోని ఛత్రపతి శివాజీ, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలను యూపీఏ ప్రభుత్వమే ప్రైవేటీకరించిందని చెప్పారు.. తాము దాన్ని కొనసాగిస్తున్నామని, ఎయిరిండియా అమ్మకం, విమానాశ్రయాల ప్రైవేటీకరణ గురించి తమను విమర్శించే అధికారం కాంగ్రెస్‌ లేదని , తిరువనంతపురం విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఇదివరకే పినరయి విజయన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఙప్తి చేశారు.
Tags:    

Similar News