ప్రపంచంలో చౌకైన డేటా.. మనం ఎన్నో స్థానంలో?

Update: 2023-04-08 09:50 GMT
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేసే పని ఏదైనా చేతిలో మాత్రం స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ చేతికి వచ్చిన తర్వాత చేతి వేళ్లు ఊరికే ఉంటాయా? ఏదో ఒకటి వెతకటమో.. కాదంటే చాటింగ్ చేయటమో చేస్తూనే ఉండే పరిస్థితి. అందుబాటులోకి వస్తున్న సాంకేతికత పుణ్యమా అని.. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగటం.. అందుకు తగ్గట్లే డేటా వినియోగం ఎంతలా ఎక్కువైందన్న దానికి నిదర్శనంగా తాజాగా విడుదలైన గణాంకాలు చెప్పేస్తున్నాయి. డేటా విషయానికి వస్తే.. ప్రపంచంలోనే మన దగ్గర అత్యంత చౌకగా ఉంటుందని చెబుతారు. అయితే.. వాస్తవం ఎంత? అన్నది ప్రశ్న. ఆ విషయాన్ని కూడా చెప్పేసే గణాంకాల నివేదిక ఒకటి వెల్లడైంది.

ప్రపంచ జనాభాలో 65.6 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని. 4.6 బిలియన్ల మంది ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరమవుతోంది. ప్రపంచంలో కారుచౌకగా మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల విషయానికి వస్తే..ఇజ్రాయెల్ మొదటి స్థానంలో నిలుస్తోంది.

ఒక జీబీ డేటాకు కేవలం 0.04 డాలర్లు (రూ.3) మాత్రమే ఉంది. తక్కువ ధరకు మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక జీబీ డేటాను 0.12 (రూ.9.50)డాలర్లకు అందిస్తుంటే.. భారత్ మూడో స్థానంలో నిలిచింది. మన దగ్గర ఒక జీబీ డేటా కు 0.17 (రూ.14) డాలర్లు వసూలు చేస్తున్నారు. (ఒక్కో డాలర్ రూ.82 చొప్పున లెక్కేసినప్పుడు దగ్గర దగ్గర ఈ ధరలు ఉన్నాయన్నది గమనించగలరు)

అత్యంత ఖరీదైన మొబైల్ డేటా ప్లాన్లు ఉన్న దేశాల్లో ఆఫ్రికా.. దక్షిణ అమెరికాలోని మారుమూల దేశాలు నిలుస్తున్నాయి. ఫాక్లాండ్ దీవుల్లోని ప్రజలు ఒక జీబీ డేటా కోసం ఏకంగా 38.45 డాలర్లు (మన రూపాయిల్లో సుమారు రూ.3150) ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్ హెలెనోలో అయితే ఒక జీబీ డేటా కోసం 41.06 డాలర్లు (రూ.3366) ఖర్చు చేయాల్సిందే.  అంటే.. ఇజ్రాయెల్ ప్రజల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ డబ్బుల్ని ఖర్చు చేయాల్సి వస్తుందన్న మాట.

మొబైల్ డేటా వినియోగానికి వస్తే.. గడిచిన ఐదేళ్లలో 3.2 రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటాను వినియోగిస్తున్నారని.. 2027 నాటికి ఇది కాస్తా 46 జీబీలకు చేరుకుంటుందని చెబుతున్నారు. 5జీ పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రావటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

మన దేశంలోని సంస్థలు రానున్న ఐదేళ్లలో ప్రైవేటు డేటా నెట్ వర్కు కోసం సుమారు 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరమైతే.. మన దేశంలో ఒక నెలకు అవసరమవుతున్న డేటా 14 ఎక్సా బైట్లకు చేరుకుందని చెబుతున్నారు. ఒక ఎక్సా బైట్ అంటే ఒక బిలియన్ గిగిబైట్లకు సమానంగా చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News