ఏపీలో పంచాయతీ ఎన్నిక‌ల‌కు గ‌డువు అదే!

Update: 2020-02-12 07:45 GMT
ఏపీ లో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌డువును పెట్టుకుంది మార్చి 15వ తేదీలోగా ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు కూడా ఏర్పాట్లు చేయ‌డానికి రంగం సిద్ధం చేసింది. వారం రోజుల పాటు పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం ఉంటుంద‌ని పేర్కొంది. ఇక మందు ప్ర‌భావాన్ని నిరోధించ‌డానికి కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎప్పుడో జ‌ర‌గాల్సింది. రెండేళ్ల కింద‌టే దాదాపుగా పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సింది. అయితే అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వం ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేదు. చాలా కాలం కింద‌టే పంచాయ‌తీ ప్రెసిడెంట్లు మాజీల‌య్యారు. గ్రామాల్లో ప్రెసిడెంట్ల రాజ్యం పోయింది. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. దీంతో మాజీ ప్రెసిడెంట్లు అంతా కోర్టుకు కూడా ఎక్కారు. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని, కాబ‌ట్టి చెక్ ప‌వ‌ర్ త‌మ‌కే ఇవ్వాల‌ని వారు కోరుతూ ఒక పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వ‌హించే వ‌ర‌కూ తామే ప్రెసిడెంట్లు గా ఉంటామంటూ వారు కోరారు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లు మాత్రం జ‌ర‌గ‌లేదు.

ఇక వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాకా పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఒక్కో అడుగు ప‌డుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా గ‌డువును కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది. మార్చి 15కు పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని భావిస్తూ ఉంది. అంటే మ‌రో నెల రోజుల వ్య‌వ‌ధిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఒక కొలిక్కి రానున్న‌ట్టే. ఇప్ప‌టికే ప‌ల్లెల్లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై గ‌ట్టి ఆస‌క్తే నెల‌కొని ఉంది. అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు అయిపోయిన‌ప్ప‌టి నుంచినే ప‌ల్లెల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎప్పుడెప్పుడా అని రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వారు ఆత్రుత‌గా ఉన్నారు.


Tags:    

Similar News