మంత్రి సత్యవతి రాథోడ్ కొడుకు అలాంటి వారా?

Update: 2021-02-16 15:30 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ వ్యవహారం కాక రేపుతోంది. మంత్రిగారి అబ్బాయి విషయంలో తాను రూల్ ప్రకారం ఫాలో కావటమే తప్పుగా మారిందని.. అదే తనపై బదిలీ వేటుకు కారణమైందన్న వాదనను సదరు సూపరిండెంట్ చెబుతున్నారు. సంచలన ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ఉదంతం మంత్రి వారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందంటున్నారు.

అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా భీంసింగ్ పని చేస్తున్నారు. తాజాగా ఆయన్ను హైదరాబాద్ కు బదిలీ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ మీద తీవ్ర ఆరోపణలు సంధించారు. మంత్రి కుమారుడు తమ ఆసుపత్రిలోనే ఛెస్ట్ స్పెషలిస్ట్ గా పని చేస్తారని పేర్కొన్నారు. మంత్రిగారి అబ్బాయి నెలలో వారం రోజులు మాత్రమే ఆసుపత్రికి వస్తారని.. విధులు నిర్వహిస్తారని.. దీంతో నిబంధనలకు అనుగుణంగా తాను ఆయనకు పూర్తి జీతం ఇవ్వలేదని.. ఆ కోపంతోనే తనను హైదరాబాద్ కు బదిలీ చేశారన్నారు.

తనను కనీసం ప్రమోషన్ మీద పంపినా సంతోషపడేవాడినని.. మరో ఏడాదిలో రిటైర్ కానున్న తనను బదిలీ చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. డిప్యుటేషన్ మీద తనను హైదరాబాద్ పంపారన్నారు. మంత్రిగారి అబ్బాయి హైదరాబాద్ లో ఉంటూ.. మహబూబాబాద్ లోఇచ్చే జీతం తీసుకోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త కలకలానికి తెర తీసింది. మరి.. దీనిపై మంత్రిగారు ఎలా రియాక్టు అవుతారో?


Tags:    

Similar News