కార్పొరేట్ల మొదటి ప్రాధాన్యం కమలం పార్టీనే!

Update: 2022-04-05 04:39 GMT
దేశీయ రాజకీయ రంగానికి నిధులు అందించే కార్పొరేట్ సంస్థలకు ఏపార్టీ అంటే ఎక్కువ అభిమానం? అన్న ప్రశ్న వేస్తే.. కమలం పార్టీ అని మరో ఆలోచన లేకుండా చెబుతారు. దీనికికారణం.. గడిచిన ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటమే దీనికి కారణం. పవర్ లో ఎవరుంటే వారికి కార్పొరేట్ నిధులు భారీగా కేటాయించటం వ్యాపార వర్గాలకు అలవాటే.

తాజాగా అదే విషయాన్ని వెల్లడించిందో నివేదిక. కాకుంటే.. గడిచిన పదేళ్లలో బీజేపీకి కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్లిన విరాళాల లెక్క చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.

రాజకీయ పార్టీ ఏదైనా సరే.. రూ.20వేలకు మించిన విరాళం ఇవ్వాలంటే దాన్ని చెక్కు రూపంలో కానీ.. ఆన్ లైన్ లో కానీ.. డ్రాప్టు రూపంలో కానీ ఇవ్వాల్సిందేనన్నవిషయంతెలిసిందే. అయితే.. పదేళ్ల క్రితంతో పోలిస్తే.. తాజాగా కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎంత భారీగా ఉన్నాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. పదేళ్ల క్రితం అంటే 2004-12తో పోలిస్తే 2009-20లో కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు 143 వాతం పెరిగినట్లుగా గుర్తించారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20వేల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల పార్టీలు భారత ఎన్నికల కమిషన్ కు అందించిన వివరాల ఆధారంగా ఈ ఆసక్తికర విశ్లేషణ చేపట్టారు.2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని కార్పొరేట్ సంస్థలు ఐదు జాతీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు ఏకంగా రూ.921 కోట్లుగా తేల్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కార్పొరేట్లు ఇచ్చిన విరాళాల్లో అత్యధిక భాగంగా బీజేపీకే వెళ్లటం గమనార్హం. దేశంలోని ఐదు జాతీయ పార్టీల్లో బీజేపీకి గరిష్ఠంగా 2025 కార్పొరేట్ దాతల నుంచి ఏకంగా రూ.720 కోట్లు అందగా.. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.

కాకుంటే కమలనాథులకు.. కాంగ్రెస్ కు మధ్య విరాళాల విషయంలో ఎక్కడా పొంతన లేదనే చెప్పాలి. ఎందుకంటే.. బీజేపీ రూ.720 కోట్లతో టాప్ లో ఉంటే.. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కేవలం రూ.133 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు అందాయి. దగ్గర దగ్గర ఈ రెండుపార్టీల మధ్య అంతరమే రూ.600 కోట్లు (కచ్ఛితంగా చెప్పాలంటే కాస్తంత తక్కువగా) ఉంది. మూడో స్థానంలో 36 కార్పొరేట్ దాతల నుంచి రూ.57 కోట్లు ఎన్సీపీకి.. ఏడీఆర్ కు అందించాయి. ఇలా కార్పొరేట్ల సంస్థల రాజకీయ విరాళాలు మొత్తం బీజేపీ చుట్టూనే తిరగటం గమనార్హం.
Tags:    

Similar News