ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చేయనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు

Update: 2022-11-19 04:59 GMT
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేస్తూ.. బీజేపీ మధ్యవర్తులుగా పేర్కొంటున్న ముగ్గురు ప్రయత్నించటం.. ఎమ్మెల్యేల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యేలను విడిచిపెట్టటం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నలుగురు అదే రోజు రాత్రి ప్రగతిభవన్ కు వెళ్లారు. కట్ చేస్తే.. గడిచిన 22 రోజులుగా వారు అక్కడే ఉంటున్నారు.

ఇలా ముఖ్యమంత్రి అధికార నివాసంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండిపోవటం సంచలనమైంది. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే.. ఎమ్మెల్యేలకు హాని ఉందని.. అందుకే ప్రగతి భవన్ లో ఉన్నారని చెబుతున్నా.. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఇరవై రెండు రోజుల్లో మధ్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ల మినహా బయటకు వచ్చింది లేదు. అసలు ఎప్పటికి బయటకు వస్తారన్న సందేహాలు వ్యక్తమైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తమ ఎమ్మెల్యేలు కనిపించటం లేదంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. ఇలాంటి వేళ.. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన రోహిత్ రెడ్డి కొందరు మీడియా ప్రతినిధులకు అందుబాటులోకి వచ్చారు. తాము శనివారం ప్రగతిభవన్ నుంచి బయటకు వస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా తాను అయ్యప్ప మాల వేసుకంటానని.. ప్రగతిభవన్ నుంచి బయటకు రాగానే అయ్యప్ప మాలాధారణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి తాను నియోజకవర్గ డెవలప్ మెంట్ మీదనే ఫోకస్ చేస్తానని.. తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై తాను మాట్లాడలేనని చెప్పిన రోహిత్ రెడ్డికి పలువురు ఒక ప్రశ్నను సందిస్తున్నారు. ప్రాణహాని ఉన్నందున గడిచిన 22 రోజులుగా ప్రగతి భవన్ లో ఉన్న వారు ఇప్పుడు బయటకు వస్తున్నారు? మరి.. ఇప్పుడువారికి హాని లేనట్లా? తగ్గిపోయిందా? ఆ విషయంపై వారికి అంత నమ్మకం ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు రోమిత్ రెడ్డితో పాటు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమని బదులిస్తారు? అన్నది అసలు ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News