గుడ్ న్యూస్: పీఎస్ఎల్ వీ సీ52 ప్రయోగం విజయవంతం

Update: 2022-02-14 05:11 GMT
అంతరిక్ష ప్రయోగాల్లో మరో విజయాన్నిఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సొంతం చేసుకుంది. ఈ తెల్లవారుజామున (సోమవారం) 5.59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి52ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు. ఇందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికైంది.

రాకెట్ ప్రయోగించిన 18.31 నిమిషాలకు మూడు ఉపగ్రహాలతో కూడిన రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అభినందనలు తెలుపుకున్నారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని.. శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలందరిని అభినందించారు.

ఈ ఏడాది జరిగిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇస్రో కొత్త ఛైర్మన్ గా డాక్టర్ సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కావటం గమనార్హం. తాజా ప్రయోగంలో మూడు శాటిలైట్లను ప్రయోగించారు. వీటితో ఏమేం ప్రయోజనం కలగనుందన్న విషయాన్ని చూస్తే..

ఆర్ ఐశాట్ 1

ఈ శాటిలైట్ కాల పరిమితి 10 ఏళ్లు. రాత్రిపగలు అన్న తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహంతో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు.. అధిక నిల్వ పరికరాల్ని ఉపయోగించారు. 1710 కేజీల బరువున్న ఈ శాటిలైట్ తోవ్యవసాయం.. అటవీ.. నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం కనుగొనేందుకు ఈ శాటిలైట్ సాయం చేయనుంది.

ఇన్ స్పైర్ శాట్ 1

విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన ఈ బుల్లి శాటిలైట్ బరువు కేవలం 8.1 కేజీలు మాత్రమే. దీని ఆయుష్షు ఏడాది మాత్రమే. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్ అయానోస్పియర్ ప్రోబ్ అమర్చి ఉంటుంది.

ఐఎన్ఎస్ 2టీడీ

17.5 కేజీల బరువున్న ఈ శాటిలైట్ ను భారత్ - భూటాన్ లు కలిపి తయారు చేశాయి. దీని జీవితకాలం ఆర్నెల్లు మాత్రమే. అయితే.. ఈ శాటిలైట్ తో భవిష్యత్తు సైన్సు.. ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం రూపొందించారు.
Tags:    

Similar News