గన్ మెన్లను మార్చారు.. నాకేమైనా అయితే సీఎం జగన్ బాధ్యుడు

Update: 2022-10-11 03:26 GMT
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ను ఆయన ఊళ్లో.. ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేయటం.. అనంతరం ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారటమే కాదు..

ఈ హత్య పుణ్యమా అని జగన్ సర్కారు ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్య జరిగినప్పటికీ.. దీని కీలక విచారణ జగన్ సర్కారు హయాంలోనే జరిగింది. అయితే.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు జగన్ సర్కారును తరచూ చిరాకులో పడేసే పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరి.. హటాత్తుగా అప్రూవర్ గా మారిపోవటం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అతనికి గన్ మెన్ల రక్షణ ఇచ్చారు. అయితే.. ఇటీవల ఆయనకు కేటాయించిన గన్ మెన్ల స్థానంలో వేరే వారిని మారుస్తూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త ఆరోపణలకు కారణమైంది. తనకు రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పోలీసుల్ని ఆశ్రయించారు. తన గన్ మెన్లను హటాత్తుగా మార్చేశారని.. తనకు ఏమైనా జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యతగా పేర్కొనటం గమనార్హం.

కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి.. ఎస్పీని కలిసిన సందర్భంగా తన గన్ మెన్లను మార్చటంపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను మార్చారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎస్పీ పట్టించుకోవటం లేదన్న దస్తగిరి తొండూరు మండల వైసీపీ నేతలు తనపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. దస్తగిరి ఆరోపణల్ని జిల్లా ఎస్పీ కొట్టిపారేశారు. గన్ మెన్ల మార్పు అనేది పాలనా పరమైన అంశమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అప్రూవర్ గా మారిన దస్తగిరికి క్షమాభిక్షపై ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి..

శివశంకర్ రెడ్డిలు సుప్రీంను ఆశ్రయించారు. అయితే.. హత్య కేసులో సహ నిందితులుగా అప్పీలు చేసే అధికారం లేదన్న సుప్రీంకోర్టు వారి పిటిషన్ ను తోసిపుచ్చింది. మొత్తంగా దస్తగిరి ఆరోపణలతో వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదన్న విషయం మరోసారి తెర మీదకు వచ్చినట్లైంది. మరీ.. కేసులో దోషులు ఎవరో నిరూపితం కావాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News