మైనింగ్‌ కింగ్‌ కు షాకిచ్చిన హ్యాకర్లు!

Update: 2023-01-07 07:30 GMT
ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో నిర్దేశించిన పరిమితికి మించి ఇనుప ఖనిజాన్ని తవ్వేసి వందల కోట్ల రూపాయలు ఆక్రమించినట్టు గాలి జనార్దన్‌రెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులను బెదిరించడం, లంచాలు ఇవ్వజూపడం, పన్నులు ఎగ్గొట్టడం వంటి పలు కేసుల్లో గాలి జనార్దన్‌ రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. రెండేళ్లకు పైగానే జైలులో ఉన్నారు.

గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాతోపాటు రాయచూరు తదితర జిల్లాలను కూడా తన కనుసైగతో శాసించారు.. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సోదరులు గాలి సోమశేఖరరెడ్డి, గాలి కరుణాకర్‌రెడ్డి. ఆ తర్వాత ఓఎంసీ వ్యవహారంలో గాలి జనార్దన్‌ రెడ్డి నాటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పోగొట్టుకుని జైలుపాలయ్యారు.

ఈ నేపథ్యంలో బీజేపీ తనను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసిందని మైనింగ్‌ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోనూ, కర్ణాటకలోనూ అధికారంలో ఉన్న బీజేపీ తనకు చేసిందేమీ లేదన్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో తాజాగా గాలి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో గాలి జనార్దన్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో చేరికలు కూడా మొదలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో గాలి జనార్దన్‌ రెడ్డికి హ్యాకర్లు షాక్‌ ఇచ్చారు. గాలి జనార్దన్‌ రెడ్డికి చెందిన సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాకర్లు హ్యాక్‌ చేయడం కలకలం సృష్టిస్తోంది. అంతేకాకుండా గాలి సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేయడంతో ఆగని హ్యాకర్లు ఆయనకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు గాలి జనార్దన్‌ రెడ్డి సన్నిహితుడు దామోదర్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ నాయకుడు గాలి జనార్దన్‌ రెడ్డి సోషల్‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని.. హ్యాకర్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన సన్నిహితుడు దామోదర్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించి కర్ణాటకలో ప్రధాన పార్టీలకు కంట్లో నలుసులా మారిన గాలి జనార్దన్‌ రెడ్డికి చెందిన సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

మరోవైపు కొందరు బీజేపీ నేతలు సీబీఐని ప్రయోగిస్తామని గాలి జనార్దన్‌ రెడ్డిని బెదిరిస్తున్నారని ఆయన మద్దతుదారులు విమర్శసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను నిజాయితీగా వ్యాపారం చేశానని.. ఏ అవినీతికి పాల్పడలేదని.. 100 జన్మలెత్తినా తమ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయలేదని గాలి జనార్దన్‌ రెడ్డి సవాల్‌ విసరడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News