పుచ్చకాయలకు ఇల్లు అమ్మేస్తున్నారు.. ఎక్కడంటే

Update: 2022-07-05 11:36 GMT
సాధారణంగా మనం ఊళ్లలో ఇనుప సామాను కి మామిడి పండ్లు, బీరు సీసాలకు ఐస్ క్రీములు అమ్మడం చూశాం. కానీ చైనాలో మాత్రం ఏకంగా పుచ్చకాయలు, గోధుమలు, వెల్లుల్లికి ఇండ్లు అమ్మేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఇది నిజమా కాదా అని సందేహిస్తున్నారా..? మరెందుకు ఆలస్యం.. ఈ స్టోరీ చదివేయండి.. అసలు మ్యాటరేంటో తెలిసిపోతుంది.

ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పుచ్చకాయలకి ఇల్లు అమ్మాడన్న వార్త ఒకటి చైనా పత్రికల్లో కనిపించింది. "నాన్‌జింగ్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది" అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. కానీ ఇదంతా చైనా అసలు పరిస్థితిని కప్పిపుచ్చేందుకు రాసిన కథనం అని కొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు రుణ ఎగవేతకు పాల్పడుతున్నాయి.

తాజాగా షాంఘైకి చెందిన షిమో గ్రూప్‌  బిలియన్‌ డాలర్ల బాండ్లకు వడ్డీ, అసలు చెల్లింపులను ఎగవేసింది. విక్రయాల పరంగా ఈ సంస్థ చైనాలో 14వ అతిపెద్ద రియల్‌ఎస్టేట్‌ కంపెనీ. చైనాలో డాలర్ల చెల్లింపుల్లో జరిగిన అతిపెద్ద ఎగవేతల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు. ఈ సంస్థకు దాదాపు 5.5 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాలు ఉన్నాయి. ఈ సంస్థ గతంలో ఓ మూసివేసిన క్వారీలో నిర్మించిన ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎవర్‌ గ్రాండే సంక్షోభం, చైనా రియల్‌ ఎస్టేట్‌పై నిబంధనల కొరడా ఝుళిపించడంతో ఈ సంస్థ కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది.

చైనాలోని రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ బయటకు కనిపిస్తున్న దానికంటే ఘోరంగా ఉందని.. భవిష్యత్తులో ఈ రుణ ఎగవేతలు పెరుగుతాయని ఇటీవల గోల్డ్‌మన్‌శాక్స్‌ నివేదిక వెల్లడించింది. చైనాలో ప్రాపర్టీ సెక్టార్‌లోని హైఈల్డ్‌ బాండ్లను జారీ చేసిన 22 సంస్థలు ఈ ఏడాది డాలర్‌ ఆధారిత బాండ్ల చెల్లింపులను ఎగవేయడం కానీ, జాప్యం చేయడం గానీ చేసినట్లు పేర్కొంది. స్టాక్‌ మార్కెట్‌ వలే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంత తేలిగ్గా పుంజుకోదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచే వస్తోంది. తాజాగా ఆ దేశంలోని టాప్‌ 100 డెవలపర్ల విక్రయాలు తొలి నాలుగు నెలల్లో సగానికి పడిపోయాయి. ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గింది. 2021లో నిర్మాణాల్లో ఏకంగా 14 శాతం తగ్గుదల నమోదైంది. మిలియన్ల కొద్దీ చదరపు అడుగుల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ఆరేళ్లలో తొలిసారి గత సెప్టెంబర్‌ నుంచి ఇళ్ల ధరల్లో పతనం మొదలైంది. ఫలితంగా ముందస్తుగానే నిర్మాణాలకు చెల్లింపులు చేసిన వినియోగదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కొనుగోలుదారులు ఓ పట్టాన ముందుకు రావడంలేదు. చైనాలోని నగరవాసుల సంపద 70 శాతం గృహాలపై పెట్టుబడుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను ఆదుకొనేందుకు కేంద్ర బ్యాంక్‌ రంగంలోకి దిగింది. భవిష్యత్తులో షీజిన్‌పింగ్‌ మూడోసారి అధికారం చేపట్టనున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీకి ఇది పెను సవాలుగా మారింది.
Tags:    

Similar News