ఇదెక్కడి రచ్చ కేసీఆర్.. రోజుకొకరికి షాకులు తప్పట్లేదు?

Update: 2021-07-02 17:30 GMT
పాలనలో తమకు మించి తోపులు మరెవరూ ఉండరని చెప్పుకోవటం పాలకులకు మామూలే. తమకు తాము గొప్పలు చెప్పుకోవటం.. ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసుకోవటం.. సెల్ఫ్ సర్టిఫికేట్లు జారీ చేసుకోవటం చూసేందుకు బాగానే ఉన్నా.. అలాంటి వారు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కానీ జనాల రియాక్షన్ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది గడిచిన కొద్దిరోజులుగా టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. హామీలు ఇవ్వగానే సరికాదు.. వాటిని అమలు చేయకుంటే ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందన్న విషయం టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో గులాబీ బ్యాచ్ కు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. చివరకు మంత్రి హరీశ్ రావు లాంటి నేతకు తాజాగా తన సొంత జిల్లాలోనే ఇలాంటి షాకే తప్పలేదు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలోని కుకునూరుపల్లి.. తిప్పారం.. ముద్దాపూర్ గ్రామాల్లో జరిగిన సభలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుంటే.. చెవులు అప్పగించి వినటం మానేసి.. తమకు ఇచ్చిన హామీల్ని ఎప్పటికి అమలు చేస్తారంటూ ప్రశ్నించిన వైనంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమకు ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని నిలదీశారు. ఆగ్రహంతో శివాలెత్తిన మహిళల్ని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.. తీవ్ర అసహనానికి గురైన ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రజల నుంచినిరసన ఎదురైంది. స్థానిక సమస్యల్ని పట్టించుకోకపోవటం.. డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయకపోవటాన్ని ప్రశ్నించారు.

 ధర్మారెడ్డి ఎన్ని మాటలు చెప్పినా అక్కడి వారు ఆగ్రహం తగ్గకపోవటంతో ఆయన కార్యక్రమం మధ్య నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. చూస్తుంటే.. టీఆర్ఎస్ నేత హనీమూన్ ముగిసినట్లేనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News