వైసీపీ పార్టీలో ఇదో టైపు అసమ్మతి

Update: 2020-07-09 08:30 GMT
అధినేత తీసుకునే నిర్ణయంతో ఇబ్బందులు ఎదురవుతాయని అనుకుందాం. తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాకు నష్టం వాటిల్లే చర్యల్ని బహిరంగ వేదికల మీదనే ప్రస్తావించాలా? అధినేతతో నేరుగా సమావేశమై.. ఇలాంటి పరిస్థితి నెలకొంది.. మీరు పెద్ద మనసు చేసుకొని కాస్త చూస్తే.. సమస్య నుంచి బయటపడతామని సీనియర్ నేత ప్రత్యేకంగా కలిసి చెబితే కాదనే సీఎం ఎవరైనా ఉంటారా? మరి.. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు.. ఆయనకు నీడలా ఉండే విజయసాయి రెడ్డి పాల్గొన్న సభలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు లేవనెత్తిన అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల్ని ఏర్పాటు చేస్తే.. శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నది ధర్మాన వారి ఆవేదన. అదెలానో కూడా ఆయన చెప్పేస్తున్నారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే..శ్రీకాకుళం జిల్లా మరో 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా శ్రీకాకుళం కొత్త రోడ్డులో వైఎస్ విగ్రహాన్ని ధర్మాన ఆవిష్కరించిన సందర్భంలో సమయాన్ని చూసుకొని తన మనసులోని మాటను బయటపెట్టేశారు ధర్మాన.

శ్రీకాకుళం జిల్లాలో డెవలప్ అయిన ఎచ్చెర్ల..పాలకొండ.. రాజాం ప్రాంతాల్ని కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయనగరం జిల్లాలో కలిపి వేస్తారన్న భావన జిల్లా ప్రజల్లో ఉందని.. ఈ విషయంపై వారు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ప్రజలు.. ఆయా ప్రాంతాల నేతల మనోభావాల్ని తెలుసుకొని జిల్లాల ఏర్పాటు చేయాలే తప్పించి.. పార్లమెంటు స్థానం ఆధారంగా చేపట్టటం సరికాదన్న వాదనను వినిపించారు.

ఇదంతా చూస్తే.. అసమ్మతిని కొత్త తరహాలో పలికించిన ధర్మాన తెలివికి అబ్బురపడాల్సిందే. వైఎస్ హయాంలోనే మంత్రిగా వ్యవహరించిన ధర్మాన.. జగన్ సర్కారులో మాత్రం ఎలాంటి పదవి లేకుండా ఉండటం తెలిసిందే. సమయం చూసుకొని మరీ గొంతు విప్పిన ధర్మాన తీరు చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ లో అసమ్మతిని సరికొత్త తరహాలో ప్రదర్శించటాన్ని చూసి నేర్చుకోవాల్సిందే.
Tags:    

Similar News