జ‌గ‌న్ గ్రాఫ్ పెరుగుతున్నా!... ఎమ్మెల్యేల ప‌రిస్థితి దారుణం!

Update: 2021-05-20 14:30 GMT
ప్రాణాంత‌క‌ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ప్రాణాంత‌క వైర‌స్ గానే ఇప్ప‌టిదాకా ప‌రిగ‌ణిస్తున్న ఈ వైర‌స్ ను ఇప్పుడు మాయ‌దారి వైర‌స్ అని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ వైర‌స్ ను ధైర్యంగా ఎదుర్కొంటున్న వారు, దీని విరుగుడు మంత్రాన్ని క‌నిపెడుతున్న వారు రాత్రికిరాత్రే ఓ రేంజి మైలేజీని పొందుతుంటే... దీనిని ఎదుర్కొని నిల‌బ‌డ‌లేని వారు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప‌రిపాల‌న‌లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వంటి నేత‌ల గ్రాఫ్ అమాంతంగా కింద‌పడేసిన క‌రోనా వైర‌స్‌.. క‌రోనాకు ఏమాత్రం జ‌డ‌వ‌కుండా త‌న‌దైన శైలి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ను మాత్రం అంత‌కంత‌కూ పెంచేస్తోంది. మ‌రి జ‌గ‌న్ గ్రాఫ్ పెరిగితే... ఆయ‌న పార్టీ నేత‌లు... ప్ర‌త్యేకించి వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా పెర‌గాలి క‌దా? మ‌రి అలా జ‌రుగుతోందా? అంటే... జ‌గ‌న్ గ్రాఫ్ పెరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం పెర‌గ‌క‌పోగా... అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంద‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

అస‌లు క‌రోనా సెకండ్ వేవ్ ఏకంగా మోదీ గ్రాఫ్ నే త‌గ్గిస్తోంటే... జ‌గ‌న్ గ్రాఫ్ ఎలా పెరుగుతోంద‌న్న విష‌యానికి వ‌స్తే... క‌రోనా ఎంత‌టి విల‌యం సృష్టిస్తున్నా.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచే విష‌యంలో జ‌గ‌న్ వెనుక‌డుగు అన్న‌దే లేకుండా సాగుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు తాను ప్ర‌క‌టించిన ప‌థ‌కాల అమ‌లుతో పాటు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రారంభించిన ప‌థ‌కాల అమ‌లును నాన్ స్టాప్ గా జ‌గ‌న్ కొన‌సాగిస్తూనే ఉన్నారు. క‌రోనా సాకు చూపి ఏ ఒక్క ప‌థ‌కాన్ని ఆపిన దాఖ‌లా ఏపీలో క‌నిపించ‌డమే లేదు. క‌రోనా కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత‌గా దిగ‌జారుతున్నా... సంక్షేమ ప‌థ‌కాల‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా జ‌గ‌న్ చూస్తున్నారు. ఆయా ప‌థ‌కాల అమ‌లుకు కావాల్సిన నిధుల‌ను ఎలాగోలా స‌ర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక క‌రోనా క‌ట్ట‌డిలో కూడా ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా జ‌గ‌న్ సాగుతున్నారు. రాష్ట్రంలో ఓ వైపు క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్నా... ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా జ‌గ‌న్ త‌న‌దైన శైలి చ‌ర్య‌లతో సాగుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డిలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల‌ను దేశంలోని ఇత‌ర రాష్ట్రాలు మ‌క్కీకి మ‌క్కి కాపీ కొట్టేశాయంటే అతిశ‌యోక్తి కాదు. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ జ‌గ‌న్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతూనే ఉంది.

స‌రే మ‌రి... జ‌గ‌న్ గ్రాఫ్ అలా పెరిగిపోతూ ఉంటే... ఆయ‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా పెర‌గాల్సిందే క‌దా అంటారా? అలాంటిదేమీ లేదు. ఎందుకంటే... క‌రోనా క‌ట్ట‌డి కోసం జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న చ‌ర్య‌లు, వాటి అమ‌లులో ఎమ్మెల్యేల పాత్ర అంత‌గా అవ‌స‌రం లేద‌నే చెప్పాలి. జ‌గ‌న్ స‌ర్కారు ఆదేశాల‌ను అధికార యంత్రాంగం క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేస్తోంది. అందులోనూ క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌తినిధులు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక వైసీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్త వారే ఉన్నారు. వారంతా... సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే ఎలా వెళ్లాలో పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. అలాంటిది కరోనా ప‌రిస్థితుల్లో జ‌నం మ‌ధ్య‌కు ఎలా వెళ్లాల‌న్న విష‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అంతేకాకుండా క‌రోనా నేప‌థ్యంలో దానిని క‌ట్ట‌డి చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో ఎమ్మెల్యేల ప్ర‌మేయంతో జ‌రిగే అభివృద్ధి ప‌నుల ఊసే లేదు. దీంతో ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌స‌రం ఎంత‌మాత్రం క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్ నేత, చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి లాంటి వారు కరోనా స‌మ‌యంలోనూ జనం వ‌ద్ద‌కు వెళుతున్నారు, జనాన్ని ఆదుకుంటున్నారు. అయితే ఈ త‌రహా వ్యూహ‌ర‌చ‌న లోపంతో వైసీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల గ్రాఫ్ అంత‌కంత‌కూ త‌గ్గుతోంద‌నే చెప్పాలి.




Tags:    

Similar News