పంచాయ‌తీల ఖాతాల‌నూ ఊడ్చేసిన జ‌గ‌న్ స‌ర్కారు!?

Update: 2021-11-24 17:56 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. సంక్షేమ ప‌థ‌కాల‌కు, ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌కు వెచ్చించేందుకు స‌రిప‌డా ఆదాయం రాక‌పోవ‌డం.. వ‌చ్చిన రాబ‌డి కూడా అప్పులు క‌ట్టేందుకే స‌రిపోతుండ‌డం.. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుకు అప్పులు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలివ్వాల‌న్నా.. పెన్ష‌న‌ర్ల‌కు డ‌బ్బులు జ‌మ చేయాల‌న్నా అప్పు చేయాల్సిన ప‌రిస్థితే ఉంది. అవ‌స‌ర‌మైన అన్ని మార్గాల్లోనూ అప్పులు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, రాష్ట్రాన్ని దివాలా తీస్తోంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు తీవ్ర‌త‌ర‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ స‌ర్కారు గ్రామ పంచాయ‌తీల‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. అనేక పంచాయ‌తీల ఖాతాల్లోని కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఖాళీ చేసింది. ఈ విష‌యం తాజాగా వెలుగులోకి రావ‌డంతో స‌ర్పంచ్‌లు అవాక్క‌య్యారు. ఓ వైపు నిధులు ఎలా వాడుకుందామ‌ని స‌ర్పంచ్‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుండగా మ‌రోవైపు ఖాతాలో డ‌బ్బు లేక‌పోవ‌డంతో వాళ్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయ‌తీల‌కు రెండు విడ‌త‌లుగా రూ.965 కోట్లకు పైగా జ‌మ‌య్యాయి.

కానీ ఇప్పుడా ఖాతాలు చూస్తే కొన్ని వాటిల్లో ఈ నిధులో త‌గ్గిపోగా.. మ‌రికొన్నింటిలో ఏకంగా జీరో చూపిస్తున్న‌ట్లు తేలింది. పైగా వాటిపై పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల వద్ద అస‌లు స‌మాధాన‌మే లేదు. అస‌లు ఎన్ని పంచాయ‌తీల నుంచి నిధులు తీసుకున్నారు? ఆ మొత్తం ఎంత‌? ఏ అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌ల‌కు వాళ్లు జ‌వాబు చెప్ప‌లేక‌పోతున్నారని తెలిసింది. ఇప్ప‌టికే విద్యుత్తు బ‌కాయిల కింద 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గ‌తంలో దాదాపు రూ.345 కోట్లు వెన‌క్కి తీసి విద్యుత్ పంపిణీ సంస్థ‌ల‌కు చెల్లించారు. కానీ ఇప్పుడు వెన‌క్కి తీసుకున్న ఈ నిధుల‌పై మాత్రం స్ప‌ష్ట‌త లేదు. దీంతో ప్ర‌భుత్వ తీరుపై స‌ర్పంచ్‌లు మండిప‌డుతున్నారు.

సీఎం జ‌గ‌న్ తీరుకు నిర‌స‌న‌గా గుంటూరు జిల్లా చెరువ మండలంలోని గ్రామ స‌ర్పంచ్‌లు భిక్షాట‌న చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 14, 15 ఫైనాన్స్ నిధుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డంపై వాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామ పంచాయ‌తీల కోసం కేంద్రం ఇచ్చే నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిధులు లేక‌పోతే అభివృద్ధి ఎలా సాధ్య‌మవుతుంద‌ని అడుగుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షాల కార‌ణంగా గ్రామాల్లో నెలకొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారినికి నిధులే లేవ‌ని వాపోతున్నారు. డ్రైనేజీలు క్లీన్ చేసేందుకు, బ్లీచింగ్ చ‌ల్లేందుకు కూడా డ‌బ్బులు లేవ‌ని స‌ర్పంచ్‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరిగి ఆ నిధులను ఖాతాలో జ‌మ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News