ఓ గుణపాఠం నేర్పిన 'కాపునాడు' సభ

Update: 2022-12-28 13:30 GMT
పైకి 'కాపులపై' ఆవాజ్య ప్రేమ.. లోన మాత్రం తొక్కేసే కుట్ర.. కేంద్రం చెప్పినా కానీ వారికి అధికారంలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వదు.. కాపులే ముఖ్యం అని మరో ప్రతిపక్ష పార్టీ అంటుంది..కానీ జెండా ఎత్తిన మనిషియే చివరకు ఈ సభకు హాజరు కాడు.. ఇక మరో 'పవర్' పార్టీ కూడా అంతే.. కాపులకోసమే పుట్టామని చెప్పినా ఆ పార్టీ నేతలు రాలేదు. మొత్తం 'కాపునాడు' సభ ఓ గుణపాఠం నేర్పింది. ఏపీలోని పార్టీల్లో ఉన్న కాపు నేతల గైర్హాజరుతో వారి రాజకీయం ముందుకు సాగదని అర్థమైంది.

ఏపీలో ఉన్న కాపులతో రాజకీయ పార్టీలు ఆటలాడుతున్నాయి. ఎన్నికల్లో కాపుల ఓట్లను దక్కించుకునేందుకు ఆ వర్గం వారిని ఆదరిస్తున్నామని చెబుతున్నాయి. అయితే కాపుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన సభల్లో మాత్రం ఇలా చెబుతున్నవారు కనిపించడం లేదు. కాపులపై వారికి పైపై ప్రేమలే ఉన్నాయని ఇటీవల నిర్వహించిన కాపునాడుతో అర్థమైంది. తాజాగా విశాఖలో నిర్వహించిన కాపునాడు సభలో కొందరు రాజకీయ నాయకులకు కాపులపై ఏపాటి అభిమానం ఉందో అర్థమైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఈ సభకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా చర్చ సాగుతోంది.  దీంతో ఇన్నాళ్లు కాపుల కోసం కేవలం కపట ప్రేమ ప్రకటనలే ఇస్తున్నారని అనుకుంటున్నారు.

విశాఖలో నిర్వహించిన కాపునాడు సభలో వంగవీటి రంగాను హైలెట్ చేశారు. ఆయన ఫొటోను ప్రధానంగా ఉంచి.. సినీ నటుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాలను ఉంచారు. అయితే వారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయినందున వారి ఫొటోలను పెట్టారని అంటున్నారు.  చిరంజీవి చిత్రాన్ని అంత పెద్దగా హైలెట్ చేసినా ఈ సభకు ఆయన హాజరు కాలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు కాపుల కోసం ఉద్యమానికి రెడీ అని చెప్పిన స్థానిక విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు కనిపించలేదు. తాము వంగవీటి రంగా అభిమానులమని చెప్పుకున్న బొండా ఉమ కనిపించలేదు.

ఇదిలా ఉంటే వైసీపీ నాయకులు మొన్నటి వరకు కాపుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారిని బీసీల్లో చేర్చాలని అడుగుతున్నారని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిజంగా వారి అభివృద్ధి కోసం పాటుపడితే కాపునాడు సభలో ఎందుకు కనిపించలేదని అడుతున్నారు. దీనిని భట్టి చూస్తే కాపులపై రాజకీయ పార్టీలకు ఎంత అభిమానం ఉందో అర్థమైందని అనుకుంటున్నారు. వారి ఓట్ల కోసం, వారిని అక్కున చేర్చుకోవడానికి నాటకాలే తప్ప వారి అభివృద్ధి కోసం పాటుపడేవారు లేరని అంటున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సైతం తాము వంగవీటి వారసులమని చెప్పుకుంటున్నారు. వంగవీటి రంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ఉందా..? అని అడుగుతున్నారు. పవన్ కల్యాణ్ కాపు వర్గానికి చెందినంత మాత్రాన వారి అభివృద్ధికి నిజంగానే కృషి చేస్తాడా..? అనే ప్రశ్న ఎదురవుతుంది. కాపు ఓట్లను పొందేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దన్నా పవన్ తో పొత్తు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండి కాపులకు ఏం చేశారని అడుగుతున్నారు.

మొత్తంగా విశాఖలో నిర్వహించిన కాపునాడుతో వారిపై ఏ రాజకీయ పార్టీకి ఎంత ప్రేమ ఉందో అర్థమైందని చర్చించుకుంటున్నారు. ప్రతీ ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం వారిలో చిచ్చుపెట్టి రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో కాపునేతలు తమ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలతో చాకచక్యంగా వ్యవహరించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాపులపై ఎలాంటి హామీలు కురిపించి వారిని ఆదరించాలని ప్రయత్నిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News