దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ ట్రాఫిక్ పై సరికొత్త టెక్నాలజీ

Update: 2020-05-28 06:30 GMT
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ కు ముందుకు జీవన విధానానికి.. ఇప్పటికి పోలికే లేదు.ఒకవిధంగా చెప్పాలంటే మాయదారి రోగం ప్రపంచ గమనాన్నే మార్చేసింది. కొత్త ఆలోచనలకు.. అలవాట్లకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో మాదిరి ఉండలేని పరిస్థితి. ప్రతి సందర్భంలోనూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందే.

ఇదంతా బాగానే ఉన్నా.. రోడ్ల మీద కిక్కిరిసే ట్రాఫిక్ వేళ.. వాహనాల మధ్య భౌతిక దూరం చాలా అవసరం. ఇప్పటివరకూ దాన్ని పాటిస్తున్న వారి సంఖ్య నామమాత్రమే. దీంతో.. మహమ్మారి మరింతగా విస్తరించే వీలుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసు శాఖ తాజాగా కొత్త టెక్నాలజీని తెర మీదకు తీసుకొచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా.. డీప్ లెర్నింగ్ పద్దతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అసరాగా చేసుకొని రోడ్ల మీదకు వచ్చే వాహనాలు సైతం భౌతిక దూరాన్ని పాటించేలా చేస్తారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని రద్దీ ప్రాంతాల్ని ఆన్ లైన్ లో కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు ఆయా రహదారుల్లో ఉన్న కెమేరాల ద్వారా లైవ్ లో చూస్తే.. భౌతిక దూరాన్ని పాటించని వాహనాల్ని గుర్తిస్తారు. తొలి దశలో అలాంటి వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ విధానంలో ట్రాఫిక్ జాంలను గుర్తించటం.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లను అలెర్టు చేయటం ద్వారా.. రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచి పోవటం.. భౌతిక దూరం లేని కారణంగా తలెత్తే సమస్యల్ని పరిష్కారించాలన్నదే తెలంగాణ పోలీసుల ఆలోచనగా చెబుతున్నారు. అదిరేలా ఉన్న ఈ ఐడియా ప్రాక్టికల్ గా అమలు చేసే వేళ..  ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Tags:    

Similar News