బిహార్ లో సత్తా చాటిన లెఫ్ట్ పార్టీలు !

Update: 2020-11-11 13:30 GMT
బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ముగిస్తున్నా కొద్ది ఉత్కంఠరేపిన బిహార్ ఎన్నికల ఫలితాలలో చివరకు బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే పై చేయి అయింది. బిహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 మేజిక్ ఫిగర్‌ని దాటి స్పష్టమైన మెజారిటీతో 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బీజేపి-74, ఆర్జేడీ-75, జేడీయూ-43, ఎల్జేపీ-01, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-02, సిపిఐ 2, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో వ్యూహాలు పన్నిన తేజస్వి యాదవ్ .. కొద్దిలో అధికారాన్ని కోల్పోయాడు. కూటమిలో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపకపోవడంతో ఎన్డీఏ కూటమిదే పై చేయిగా నిలిచింది.

ఇక ఇదిలా ఉంటే ... ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలు మళ్లీ తమ సత్తా ను చూపించాయి. గత అసెంబ్లీలో లెఫ్ట్‌ పార్టీలకు కేవలం 3 సీట్లలో ప్రాతినిథ్యం ఉండగా, ప్రస్తుతం 16 స్థానాల్లో జెండా ఎగురవేశాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క నియోజకవర్గంలో గెలుపొందగా, మిగిలిన లెఫ్ట్‌ పార్టీలకు అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేదు. గత ఎన్నికల్లో సీపీఐ-ఎంఎల్‌(లిబరేషన్‌) మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా, సీపీఐ, సీపీఎం ఒక్క స్థానాన్నీ సాధించలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ ‌బంధన్‌ కూటమిలో ఈ మూడు పార్టీలు చేరి ఏకంగా 29 స్థానాల్లో పోటీచేసి 16 చోట్ల విజయ బావుటా ఎగురవేశాయి. సీపీఐ-ఎంఎల్‌(లిబరేషన్‌)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లను తేజస్వీ యాదవ్‌ కేటాయించారు. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించిన స్థానాలు కూడా ఉండటం గమనార్హం.
Tags:    

Similar News