సేనానే రేపటి కింగ్ : పవన్ నమ్ముతున్న మ్యాజిక్ నంబర్ ...?

Update: 2022-07-14 10:30 GMT
రాజకీయాల్లో నంబర్లే కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆ సంగతి ఇపుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కి బాగా అర్ధమైపోయింది. అందుకే ఆయన తనకు నచ్చిన అచ్చి వచ్చే ఒక లక్కీ నంబర్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ నంబర్ నే ఇపుడు ఆయన ప్రతీ రోజూ జపిస్తున్నారు. ఆ నంబర్ తనకు రావలని పరితపిస్తున్నారు. ఇంతకీ ఈ నంబర్ గేమ్ ఏంటి, మ్యాజిక్  నంబర్  ఏంటి అంటే కధ చాలానే ఉంది మరి.

ఏపీలో టోటల్ గా 175 సీట్లు ఉన్నాయి. ఎవరైనా అధికారంలోకి రావాలీ అంటే 88 సీట్లు అవసరం. దాన్ని మ్యాజిక్ ఫిగర్ అంటారు. విభజన తరువాత చంద్రబాబు టీడీపీకి 100కు పైగా సీట్లు వచ్చాయి. ఆయన ఈజీగా సీఎం అయిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ కి 151 సీట్లు దక్కాయి. కళ్ళు మూసుకుని సింహాసనం ఎక్కేశారు.

మరి 2024 సంగతేంటి. ఈసారి మ్యాజిక్ ఫిగర్ ఎవరిని పిలుస్తుంది, ఎవరిని వరిస్తుంది ఇది పెద్ద చర్చగానే ఉంది. ఎందుకంటే ఈసారి రాజకీయాలు కాస్తా డిఫరెంట్ గానే ఉంటాయి. పవన్ 2019 నాటి వారు కాదు, జనసేనను కూడా లైట్ తీసుకునే సీన్ లేదు. అదే విధంగామ్ 2024 నాటికి  జగన్ అంటే చూసేసిన సినిమా అనే అంటారు. చంద్రబాబు పాలన కూడా ఎరిగిందే. ఇలాంటి నేపధ్యంలో ప్రజలు ఓట్లు వేయడం, తీర్పు చెప్పడం అంటే కొంత సంక్లిష్టమైన పరిస్థితినే తీసుకువస్తుందా అన్న మాట కూడా ఉంది.

జగన్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నా అది వన్ సైడెడ్ గా టీడీపీకి ఎంత వరకూ టర్న్ అవుతుంది అన్నది అతి పెద్ద ప్రశ్న. అలాగే 151 సీట్లు కొట్టిన జగన్ మరె అంత ఈజీగా ఓడుతారా, లేక మరీ తక్కువ సీట్లకు పడిపోతారా అన్నది కూడా చెప్పలేని వాతావరణం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మూడవ పక్షంగా ఉంటారు. ఆయనకు బలమైన సామాజిక వర్గం మద్దతు ఒక ప్లస్ పాయింట్. సినీ గ్లామర్ రెండవ ప్లస్ పాయింట్. అధికారం చేపట్టకపోవడంతో ఆరోపణలు ఏమీలేవు. అదే టైమ్ లో జనాలలో అంచనాలు ఉంటాయి. ఆయనను కూడా చూడాలని అనుకునే వారూ ఉంటారు.

ఈ చిత్ర విచిత్ర పరిస్థితుల్లో 2024 ఎన్నికలు కనుక జరిగితే హంగ్ వచ్చి తీరుతుందని జనసేన అంచనా కడుతోంది. అదే సరిగ్గా జరగాలని కూడా కోరుకుంటోంది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఈసారి సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే ఆయన అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్రను చెపడుతున్నారని చెబుతున్నారు.

తన బలం ఇంతా అని జనంలో రుజువు చేసుకుంటే అపుడు కచ్చితంగా పోస్ట్ పోల్ అలయెన్స్ కి అవకాశం ఉంటుంది అన్నదే ఆయన మాస్టర్ ప్లాన్. ఇపుడు పొత్తులు అంటే టీడీపీ కేవలం ఆరు శాతం ఓట్ల దగ్గరనే  జనసేనను ఉంచి మాట్లాడుతోంది అన్న అసంతృప్తి కూడా వారిలో ఉందిట. అందుకే శష‌బిషలకు తావు లేకుండా తమ బలం ఇదీ అని పోటీ చేసి తేల్చుకుంటే అపుడు అధికారంలో ఎవరు రావాలన్నా తామే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చు. ఆ సమయంలో కింగ్ కూడా కావచ్చు అన్నదే జనసేన లేటెస్ట్ అజెండాగా చెబుతున్నారు.

ఇపుడు కనుక పొత్తులకు పోయి టీడీపీని గెలిపిస్తే 2029 వరకూ ఆగాలని, అపుడు వైసీపీ పుంజుకుంటే మరోసారి ఆ పార్టీ చాన్స్ దక్కించుకుంటుందని కూడా జనసేన ఆలోచిస్తోందిట. అలా అధికారం తమకు పదేళ్ళ వెనక్కి దూరం జరిగిపోతుందన్న ఆలోచనతో డూ ఆర్ డై అన్నట్లుగా 2024 ఎన్నికలను తీసుకుంటోంది అని అంటున్నారు.

మరో వైపు టీడీపీతో ముందస్తు పొత్తుల కంటే ఎన్నికల్లో గట్టిగా సీట్లు సాధించి అపుడు బేరం పెడితే ఆ లెక్క వేరుగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట. ఈ క్రమంలో జనసేన తమకు గట్టిగా కష్టపడితే 30 నుంచి నలభై సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంది. ఆ సీట్లలో అత్యధికం గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా, కోస్తాలో ఉన్నాయి.

అందుకే వాటి మీద ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టి అక్కడే ఉన్న అన్ని రకాలైన  వనరులను బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తే రేపటి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారుట. జనసేనకు 30 సీట్లు వచ్చినా కూడా కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీకే దక్కుతుంది అన్న లెక్కలూ ఉన్నాయని అంటున్నారు.

ఒక్క జనసేనకే  30 సీట్లు వస్తే 2024  ఎన్నికల్లో ఏపీలో  హంగ్ తప్ప మరేమీ రాదు అన్నది కూడా తేలిపోయే విషయం. అపుడు కలిస్తే టీడీపీ జనసేన మాత్రమే కలవాలి. అపుడు పవర్ షేరింగ్ మీద బేరం పెట్టి టీడీపీ నుంచి సాధించుకుంటే ఆ మీదట కధ అంతా సాఫీగా సాగిపోతుంది అన్నదే జనసేన వ్యూహకర్తల ఆలోచనగా ఉందిట. మొత్తానికి జనసేన మ్యాజిక్ ఫిగర్ మీదనే ఇపుడు అంతటా చర్చ సాగుతోంది.
Tags:    

Similar News