కేసులు దాస్తున్నారంటే మీడియాను తిట్టారు.. ఇప్పుడు మోడీ మాటల్ని విన్నారా?

Update: 2021-05-16 09:30 GMT
సుఖం గురించి చెప్పకున్నా ఫర్లేదు. కష్టం గురించి మాత్రం నలుగురితో పంచుకోవాలి. అలాంటప్పుడే చుట్టూ ఉన్న నలుగురికి మేలు జరుగుతుంది. కరోనా కేసుల నమోదు గురించి.. మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బోలెడన్ని విమర్శల గురించి తెలిసిందే. కేసుల నమోదును తక్కువ చేసి చూపించటం.. మరణాలు అస్సలు లేవన్నట్లుగా వాదించటం తెలిసిందే. ఒకవేళ.. ఎవరైనా చొరవ తీసుకొని.. కేసుల లెక్కల మీద తక్కువగా ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే.. వారిని చావు తిట్టు తిట్టటం.. మీకు ఇదేం పోయేం కాలం.. జనాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు..కష్టాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు నిజాల పేరుతో భయాన్ని పుట్టిస్తారా? అంటూ ప్రశ్నించేవారు.

విపత్తు ఏదైనా సరే.. దానికి సంబంధించిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. విషాదాన్ని తక్కువగా చేసి చూసుకోవటం ద్వారా.. మిగిలిన వారిలో కొంత ధైర్యంగా ఉంటుంది. కానీ.. అదే సమయంలో అలాంటి నిర్ణయం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంటుంది. కొవిడ్ విషయానికే వస్తే.. కేసుల నమోదును తక్కువగా చూపించటం ద్వారా జరిగేదేమిటి? తీవ్రత పెద్దగాలేదన్న భావన కలుగుతుంది. ప్రజల్లో ఉండాల్సినంత అప్రమత్తత ఉండదు. చివరకు ఇదో నిర్లక్ష్యంగా మారి.. వారినే నష్టపోయేలా చేస్తుంది.

కరోనా కేసుల నమోదుకు సంబంధించి దేశంలోని పలు రాష్ట్రాల వారు వాస్తవ సమాచారాన్ని దాచేసి.. మమ అన్న రీతిలో కొంత సమాచారాన్ని మాత్రమే బయటపెట్టేశారు. ఈ తీరును తప్పు పడుతూ మీడియాలో ప్రత్యేక కథనాలు.. సంచలన నిజాల్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాయి మీడియా సంస్థలు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారంటూ తిట్టి పోసేవారు. పిడి వాదనను వినిపిస్తూ.. ప్రత్యేక సందర్భాల్లో వాస్తవాల్ని చెప్పే కన్నా.. ప్రజలకు ఊరడింపుగా ఉండేలా విషయాన్ని చెప్పాలంటూ కథలు చెప్పేవారు. అలా చెబుతూ.. నిజాల్ని బయటకు వెల్లడించేవారు కాదు. ఇప్పుడీ అలవాటు ఎంత ఎక్కవ అయిపోయిందంటే.. కొవిడ్ కు సంబంధించిన కేసుల లెక్కల్ని దాచొద్దని దేశ ప్రధాని మోడీ స్వయంగా చెప్పాల్సిన పరిస్థితి.

ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కేసులు.. చోటు చేసుకుంటున్న మరణాలకు సంబంధించి వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పోలిక లేని రీతిలో ఉండటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలా వాస్తవాల్ని దాచటం ఏ మాత్రం సరికాదన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. చివరకు కేసుల సంఖ్యను దొచొద్దని ప్రధాని స్వయంగా చెప్పాల్సి రావటం చూస్తే.. దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. కేసుల సంఖ్యను దాచటం ద్వారా.. తీవ్రత లేదన్న భావన ప్రజలకు మేలు కంటే కీడు కలిగేలా చేస్తుందని చెప్పాలి. ఈ కారణంతోనే.. ఇన్నాళ్లు ఒపిక పట్టిన ప్రధాని మోడీ.. ఈ రోజున కేసుల సంఖ్యను దాచొద్దని తానే స్వయంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పుదు. ఇంతకాలం నిజాల్ని చెప్పే ప్రయత్నం చేసి.. ప్రభుత్వాలకు బాధ్యత గుర్తు చేయాలని ప్రయత్నిస్తే.. సదరు మీడియా సంస్థల్ని తిట్టిపోసిన ప్రభుత్వాలు ఇప్పుడెలాంటి సమాధానాన్ని చెబుతాయి?




Tags:    

Similar News