మూడు రాజ‌ధానుల స‌భ‌.. ఎవ‌రేమ‌న్నారు!

Update: 2021-12-18 09:22 GMT
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు డిమాండ్, రాయలసీమ అవసరాలు, ప్రభుత్వం నుంచి సాధించాల్సిన హక్కుల కోసం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన ప్రజా రాజధానుల మహాసభ కొనసాగుతోంది. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మహాసభలో సీమ అభివృద్ధిని ఆకాంక్షించే అన్ని సంఘాలు పాల్గొన్నాయి.

రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్ మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం ఎత్తుకొందని మండిపడ్డారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని అది జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోనూ రాజధానుల ఉండాలని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలేదీక్షలు చేపడతామని చెప్పారు. వికేంద్రీకరణ సాధన కోసం మహా పాదయాత్రకు సిద్ధమవుతామని తెలిపారు.

మ‌రికొంద‌రు మాట్లాడుతూ.. తాము ఏపీలో ఉన్నామా..? లేక‌.. పాకిస్తాన్‌లో ఉన్నామా అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల‌సీమ నుంచి అనేక మంది నాయ‌కులు ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని..అయితే... ఏ ఒక్క‌రూ కూడా.. త‌మ అభివృద్ధికి పూచీ వ‌హించ‌లేద‌ని.. అన్నారు. సీఎం జ‌గ‌న్ ఇప్పుడు మేలు చేస్తాన‌ని అంటుంటే.. ఓర్చుకోలేకే.. మాజీ ముఖ్య‌మంత్రి నేతృత్వంలో కొందరు త‌మ భూముల‌కు.. ధ‌ర‌లు పెంచుకునేందుకు ఉద్య‌మాలు చేస్తున్నార‌ని.. ప‌రోక్షంగా అమ‌రావ‌తి రైతుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాగా, సభకు మేథావులు, విద్యార్థులు తరలివచ్చారు. చిత్తూరు, కడప, కర్నూల్‌. అనంతపురం జిల్లాల నుంచి ప్రతినిధులు మేధావులు హాజరయ్యారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్‌ (తిరుపతి), రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ (అనంతపురం), రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి (కడప), కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి (కర్నూల్‌) పాల్గొన్నారు.
Tags:    

Similar News