పాపం ...ఆ మాజీ సీఎంకు సొంతిల్లు లేద‌ట!

Update: 2018-05-23 09:53 GMT

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని మాజీ ముఖ్య‌మంత్రులంద‌రూ జీవితాంతం ప్ర‌భుత్వ బంగ్లాల్లో నివాసం ఉండేలా యూపీ స‌ర్కార్ 2016లో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ సుప్రీం కొద్ది రోజుల క్రితం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారిక బంగ్లాల్లో నివాసం ఉంటోన్న మాజీ ముఖ్య‌మంత్రులను వెంట‌నే ఖాళీ చేయించాల్సిందిగా దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఆ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయ‌డంపై యోగి స‌ర్కార్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కొట్టి వేసింది. దీంతో, సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ - మాయావతిలు బంగ్లాలు ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కు సొంత ఇల్లు కట్టుకోకుండా తాను పెద్ద తప్పు చేశానని అఖిలేష్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇప్ప‌టివ‌ర‌కు అనుభ‌విస్తోన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి రావ‌డంపై అఖిలేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్ప‌టివ‌ర‌కు సొంత ఇల్లు క‌ట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌భుత్వ బంగ్లా నుంచి అద్దె ఇంటికి మారేందుకు తనకు కొంత గడువు కావాల‌ని సుప్రీంను కోరిన‌ట్లు తెలిపారు. సుప్రీం కోర్టు తనకు మరికొంత సమయం ఇస్తే సొంత ఇంటిని నిర్మించుకుంటానన్నారు. అఖిలేష్ తో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ - రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ - యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ - ఎన్డీ తివారీలు కూడా ఆ జాబితాలో  ఉన్నారు. అయితే, ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా చేసిన వ్య‌క్తికి క‌నీసం సొంత ఇల్లు లేక‌పోవ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. కౌన్సిల‌ర్ స్థాయి వ్య‌క్తులు కూడా సొంత ఇల్లు క‌లిగి ఉంటున్న ఈ రోజుల్లో సీఎం అయిన అఖిలేష్ కు సొంత ఇల్లు లేక‌పోవ‌డం పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. అఖిలేష్ వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని జోకులు పేల్చుతున్నారు. యూపీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌గ‌ల ఎస్పీ అధినేత కుమారుడై ఉండి...ఇల్లు లేక‌పోవ‌డం న‌మ్మ‌శక్యంగా లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News