నేషనల్ హెరాల్డ్ కేసు : మళ్ళీ మళ్ళీ ఈడీ ఆఫీస్ కి సోనియా ...?

Update: 2022-07-21 15:21 GMT
మొత్తానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారణ ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు అంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఇప్పటికే అయిదు రోజుల పాటు ఈడీ విచారణ చేసింది. రోజులో కొన్ని గంటల పాటు ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకున్నారు.

ఇపుడు సోనియా గాంధీ వంతు అంటున్నారు. ఆమెను కూడా ఇదే తీరున కొన్ని రోజుల పాటు ఈడీ విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీని ఈ నెల 25న మరోమారు హాజరుకమ్మని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

తొలిసారి మూడు గంటలు మాత్రమే సోనియాను విచారించారు. సోనియా గాంధీని ఈడీ విచారించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఇదంతా రాజకీయ వేధింపు చర్యలలో భాగమే అనికూడా విమర్శిస్తున్నారు.

దాంతో ఉభయ సభలకు చెందిన దాదాపుగా డెబ్బై అయిదు మంది కాంగ్రెస్ ఎంపీలు ఈడీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సోనియా గాంధీ అరెస్ట్ పట్ల మంటెత్తిపోయారు. మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ నిరసనలు తెలియచేశారు.

ఇవన్నీ పక్కన పెడితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ని అయిదు రోజులు విచారించిన ఈడీ అధికారులు సోనియాగాంధీ విచారణకు  మరిన్ని రోజులు ఎక్కువ కూడా టైమ్ తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది. ఇక కాంగ్రెస్ శ్రేణులు సోనియమ్మకు అండగా ఉన్నాయి. ఈ నెల 25న జరిగే మరోసారి విచారణ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు రంగం సిద్ధం చేసింది.

సోనియాగాంధీ ఈ మధ్యనే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండి వచ్చారు. దాంతో ఈడీ విచారణకు వచ్చిన ఆమెకు సహాయంగా కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. ఆమె పక్క గదిలో ఉండగా సోనియాను అధికారులు విచారించారు.
Tags:    

Similar News