క్రికెట్లో డ‌క్కౌట్ కాని ఏకైక భార‌త ప్లేయ‌ర్‌!

Update: 2021-07-13 17:30 GMT
క్రికెట్లో సెంచ‌రీ చేయ‌డానికి ప్ర‌తిసారీ అవ‌కాశం రాదుకానీ.. డ‌క్కౌట్ కావ‌డానికి ప్ర‌తి మ్యాచ్ లోనూ అవ‌కాశం ఉంటుంది. అయితే.. ఎన్ని మ్యాచుల్లో దీన్నుంచి త‌ప్పించుకున్నా.. ఏదో ఒక మ్యాచ్ లో దొరికిపోతారు ప్లేయ‌ర్స్‌. కానీ.. ఎన్న‌టికీ డ‌కౌట్ కాకుండా కెరీర్ ను ముగించిన అద‌రుదైన‌ ప్లేయ‌ర్స్ కూడా ప్ర‌పంచ క్రికెట్లో కొంద‌రు ఉన్నారు. ఆ జాబితాలో మ‌న ఇండియ‌న్ బ్యాట్స్ మెన్ ఒక్క‌రే ఉన్నారు. ఆయ‌నే య‌శ్ పాల్ శ‌ర్మ‌.

ఈ రోజు (జూలై 13) ఉద‌యం గుండె పోటుతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. దీంతో.. య‌శ్ పాల్ శ‌ర్మ క్రికెట్ జీవితం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. 1983లో భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమ్ లో య‌శ్ పాల్ స‌భ్యుడు. అంతేకాదు.. ఆ విజ‌యంలో య‌శ్ పాల్ పాత్ర కూడా అమోఘ‌మైన‌ది. ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో య‌శ్ పాల్ 61 ప‌రుగులు చేసి, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఆ విధంగా ఫైన‌ల్ వెళ్లిన టీమిండియా.. వెస్టిండీస్ పై క‌ప్పు గెలిచి క‌ల నెర‌వేర్చుకుంది.

మొత్తం 42 అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచ్ లు ఆడిన య‌శ్ పాల్.. 28.48 స‌గ‌టుతో 883 ప‌రుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అయితే.. య‌శ్ పాల్ ఘ‌న‌త ఏమంటే.. త‌న కెరీర్ ముగిసే నాటికి ఒక్క‌సారి కూడా డ‌క్కౌట్ కాలేదు. అయితే.. ఆషామాషీ బౌల‌ర్ల‌నేం ఆయ‌న ఎదుర్కోలేదు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాల‌కు చెందిన దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను ఫేస్ చేశాడు య‌శ్ పాల్‌. అయిన‌ప్ప‌టికీ.. ఎవ్వ‌రికీ సున్నా ప‌రుగుల‌కు వికెట్ ఇవ్వ‌లేదు.

భార‌త్ నుంచి ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక క్రికెట‌ర్ గా య‌శ్ పాల్ చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. 1978 లో పాకిస్తాన్ తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా కెరీర్ మొద‌లు పెట్టిన య‌శ్ పాల్.. 1984 వ‌ర‌కు మిడిల్ ఆర్డ‌ర్ లో కీల‌క పాత్ర‌పోషించారు. 1985లో త‌ల‌కు గాయ‌మ‌వ‌డంతో క్రికెట్ కు వీడ్కోలు ప‌లికారు. ఆ విధంగా క్రికెట్లో ఉన్నంత వ‌ర‌కు అద్భుతమైన ఆట‌తీరుతో అల‌రించిన య‌శ్ పాల్ ఉన్న‌ట్టుండి గుండె పోటుతో చ‌నిపోవ‌డం అంద‌రినీ క‌ల‌చి వేసింది. క‌పిల్ డెవిల్స్ టీమ్ మెంబ‌ర్స్ లో చ‌నిపోయిన మొద‌టి వ్య‌క్తి య‌శ్ పాలే కావ‌డంతో.. నాటి క్రికెట‌ర్లంతా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News