ఎక్స్ ట్రాలు కాదు.. అసలు పరుగులే.. అదీ బిగ్ బాష్ లో.. ప్రవాస భారతీయుడే కెప్టెన్

Update: 2022-12-17 06:32 GMT
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రికెట్ లీగ్ లు నడుస్తున్నాయి. యూరప్, దక్షిణ అమెరికా ఫుట్ బాల్ లీగ్ ల స్ఫూర్తితో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కరీబియన్ ఇలా ఎన్నో లీగ్ లు. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కానీ.. వాటిలో ప్రమాణాలు కాస్తంత తక్కువే. కొత్తగా దక్షిణాఫ్రికా లీగ్ కూడా ప్రారంభం కాబోతోంది. దీనికి వెన్నుదన్నుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. నాణ్యత.. పోటీతత్వంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఏదీ సాటిరాదు. జట్ల సంఖ్య పెరిగినా.. నాణ్యతలో ఏమాత్రం తేడా రాకుండా నిర్వహించడంలో బీసీసీఐని అభినందించక తప్పదు. కాగా, ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి క్రికెట్ లీగ్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్). ఆస్ట్రేలియాలో జరిగే ఈ టోర్నీకి మంచి పేరుంది. ఎలాగూ అందమైన మైదానాలుడే ఆస్ట్రేలియా కాబట్టి మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుంటారు.సహజంగానే ఆకట్టుకునే ఆస్ట్రేలియా వాతావరణంతో మ్యాచ్ లు మంచి రంజుగా జరుగుతుంటాయి. అయితే, అలాంటి లీగ్ లో శుక్రవారం అత్యంత చెత్త రికార్డు నమోదైంది.

అలెక్స్ హేల్స్ గుర్తున్నాడా..? సరిగ్గ నెల కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 10 వికెట్లతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ లో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ గుర్తున్నాడా..? 6.5 అడుగుల పైనే పొడవుండే అతడు బ్యాట్ ను పుల్లలా తిప్పుతూ అలవోకగా సిక్స్ లు కొడుతూ టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. అలాంటి బ్యాట్స్ మన్ ఉన్న జట్టు శుక్రవారం బిగ్ బాష్ లీగ్ లో కేవలం 15 పరుగులకు ఆలౌటైంది. నమ్మలేకున్నా ఇది నిజం. 5.5 ఓవర్లు మాత్రమే ఆడిన ఆ జట్టు పట్టుమని 20 పరుగులు చేయలేకపోయింది.

పేరులో థండర్ .. రికార్డు బ్లండర్ బిగ్‌ బాష్‌ లీగ్‌ టీ20 టోర్నీలో సిడ్నీ థండర్‌ జట్టుకు మంచి పేరే ఉంది. 2015లో లీగ్ విజేతగానూ నిలిచిందీ జట్టు. అలాంటిది 5.5 ఓవర్లలో 15కే ఆలౌటవడం గమనార్హం. ఇది క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రొఫెషనల్‌ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో చెక్‌ రిపబ్లిక్‌పై టర్కీ 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై నెలకొల్పిన ప్రపంచ రికార్డును సిడ్నీ థండర్‌ బద్దలు కొట్టింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ కేవలం 5.5 ఓవర్లలోనే ముగిసిపోవడం విశేషం. టీ20ల్లో అతి తక్కువ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టుగానూ థండర్‌ రికార్డులకెక్కింది. మొదట స్ట్రైకర్స్‌ 9 వికెట్లకు 139 పరుగులు చేయగా.. హెన్రీ థార్న్‌టన్‌ (2.5-1-3-5), వెస్‌ అగార్‌ (2-0-6-4)ల ధాటికి థండర్‌ చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఆ జట్టులో నలుగురు డకౌట్‌ కాగా.. ముగ్గురు ఒక్క పరుగుకే ఔటయ్యారు.

హేల్స్ 0.. రోసో 3.. టాప్ స్కోర్ 4.. ఈ మ్యాచ్ లో అలెక్స్‌ హేల్స్‌ డకౌట్ కాగా.. మరో హిట్టర్ రిలీ రొసో 3 పరుగులే చేశాడు. సిడ్నీ థండర్స్ లో 4 పరుగులు చేసిన డాగెట్‌ టాప్‌స్కోరర్‌ కావడం విశేషం. అన్నట్లు ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ స్టార్లున్న సిడ్నీ థండర్స్ కు కెప్టెన్సీ వహించినదెవరో తెలుసా..? జాసన్ సంఘా. ఆసీస్ అండర్ 19 జట్టుకు 2018లో సారథిగానూ వ్యవహరించాడు. 23 ఏళ్ల సంఘా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పెద్దగా స్కోర్లు
చేయలేదు. 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఇప్పటివరకు అతడు చేసినది 1,493 పరుగులే. 10 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 119 పరుగులు చేశాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News