సీపీఐ కరుణ కోసం పార్టీలు కొట్టుకునేలా ఉన్నాయే..

Update: 2019-09-30 11:38 GMT
హుజూర్ నగర్ ఉప ఎన్నిక అంతకంతకూ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లోపోటీ చేయకూడదని భావించిన సీపీఐకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే ఆ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆదివారం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి మరీ చర్చలు జరపటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు టీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ రంగంలోకి దిగింది.

సీపీఐ నేతలతో సంప్రదింపులు మొదలెట్టారు. సైద్ధాంతికంగా సీపీఐకి.. కాంగ్రెస్ కు మధ్య పెద్ద వ్యత్యాసాలు లేవని.. హుజూర్ నగర్ లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేత కోదండరెడ్డి చెబుతున్నారు. తాజాగా ఆయన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. గతంలో తమ రెండు పార్టీలు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతూ.. తమ మధ్యనున్న అనుబంధాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తమ మద్దతు కోసం అధికార టీఆర్ ఎస్.. విపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటి తర్వాత ఒకటి చొప్పున పోటీ పడుతున్న వేళ.. సీపీఐ మాత్రం తమ మద్దతు ఎవరికి ఇస్తామన్న విషయంపై తేల్చకుండా.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటూ రెండు పార్టీలకు ఉత్కంఠ అంతకంతకూ పెంచేస్తున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని.. సీపీఐకు ఒక్కసారిగా భారీ డిమాండ్ వచ్చేయటమే కాదు.. ఆ పార్టీ కరుణ తమకు కావాలంటే తమకు కావాలంటూ పార్టీ కొట్టుకునేలా ఉన్నాయన్న సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నేటి రాజకీయాల్లోనూ తన డిమాండ్ తగ్గలేదన్న భావన సీపీఐకి కలిగే సంతోషం అంతా ఇంతా కాదేమో?
Tags:    

Similar News