తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు చెక్ పెట్టే వీలు? అదెలానంటే?

Update: 2020-03-19 11:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను చెక్ పెట్టే సత్తా తెలుగు ప్రజలకు ఉందా? అంటే.. ఉందని చెప్పాలి. ప్రపంచంలోని వివిధ దేశాలకు సాధ్యం కానిది తెలుగు ప్రజలకు ఎలా సాధ్యమవుతుందంటే.. దానికి ఉండే కారణాలు ఉన్నాయని చెప్పాలి. అదెలానంటే..

కరోనా వైరస్ వెలుగు చూసింది డిసెంబరు చివరి వారంలో అయితే.. దాని తీవ్రత చైనాను జనవరి రెండో వారానికి వచ్చే సరికి పెరిగిపోయింది. కరోనా కారణంగా చైనాలోని వూహాన్ మహానగరం ఎలాంటి ఇబ్బందికి గురైంది? తర్వాతి రోజుల్లో చైనాను దాటి యూరోప్ తో సహా మిగిలిన దేశాలకు ఎలా పాకిందన్న విషయం తెలుగు ప్రజలకు సుపరిచితమే. కరోనా వైరస్ వ్యాప్తి.. దాని తీవ్రత.. అదెలా సోకుతుందన్న విషయంలో తెలుగు ప్రజలకు ఒక మోస్తరుగా అవగాహన ఉంది.
ఈ అవగాహనకు అప్రమత్తత తోడైతే.. కరోనా కంట్రోల్ చేయటం కష్టమైన పని కాదు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీనికి కారణం.. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవటం లాంటి మాటలు చెబితే.. అవి అర్థం లేనివని చెప్పాలి. కాకుంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు లాంటి అతి పెద్ద ఎయిర్ పోర్టు లేకపోవటం ఒక విధంగా లాభమే అయినా.. విశాఖపట్నంలో ఉన్న హార్బర్ కారణంగా కరోనా ముప్పుకు వీలుంది.

అయినప్పటికీ.. ఇప్పటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటే నమోదు కావటం ఒక విధంగా సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు పదమూడు నమోదు కాగా.. ఒకరు డిశ్చార్జ్ అయితే.. మరో పన్నెండు మందికి చికిత్స చేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది బుధవారం ఒక్కరోజులోనే పాజిటివ్ గా తేలిన విషయాన్ని మర్చిపోకూడదు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా.. ఈ మహమ్మారికి చెక్ చెప్పొచ్చు.

తొలుత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించటం.. అలాంటి వారు ఎంత సన్నిహితులైనా.. వారిని కలవకుండా ఉండటం.. అలా వచ్చిన వారు తమకు తాముగా క్వారంటైన్ అయ్యేలా సూచనలు చేయటం.. బాగా దగ్గర వారైతే ఒత్తిడి తీసుకొచ్చి మరీ స్వీయ క్వారంటన్ అయ్యేలా చేయటం.. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనట్లు తెలిసినా వెంటనే వారిని ఆసుపత్రికి పంపి.. కరోనా పాజిటివ్ టెస్టులు నిర్వహించటం లాంటివి తప్పనిసరి.
ఇక.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. విదేశీయులు లాంటి వారు వస్తే.. వారిని కలిసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వారికి సంబంధించిన సమాచారాన్ని రెవెన్యూ.. పోలీసులకు తెలియజేయటం చాలా అవసరం. విడిరోజుల్లో ఇలాంటి అప్రమత్తత అవసరం లేనప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కాస్త కఠినంగా.. కుటువుగా ఉండక తప్పదు. కరోనా భూతం దగ్గరకు రాకూడదంటే.. మనం మాత్రమే కాదు.. మన పక్కడో.. ముందోడు.. వెనకోడు.. ఇలా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు మాత్రమే కరోనాకు చెక్ చెప్పే వీలుంటుంది.
Tags:    

Similar News