కొత్త తరానికి ఛాన్స్ ఇస్తున్న గులాబీ బాస్

Update: 2019-10-07 10:59 GMT
పాత నీరు పోవటం.. కొత్త నీరు రావటం మామూలే. ఇది ప్రకృతి ధర్మం. రాజకీయాల్లో నేతలు పాతబడిపోవటం.. వారికి ప్రత్యామ్నాయంగా కొత్త నేతలు పుట్టుకొస్తుంటారు. తెలంగాణలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉద్యమాలు గులాబీ నేతలకు కొత్త కాదు. కాకుంటే.. బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ కే కొత్త.

అయితే.. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువమంది బీటీ బ్యాచ్ నేతలకే పదవుల్లో ఉండటంతో రానున్న ముప్పును అంచనా వేయలేకపోతున్నట్లుగా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ భావిస్తోంది. ఉద్యమాల తీవ్రత ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారతాయి? ప్రజల మైండ్ సెట్ లో వచ్చే మార్పుల్ని ఉద్యమ టీఆర్ఎస్ నేతలతో పోలిస్తే.. బీటీ బ్యాచ్ కు అవగాహన తక్కువనే చెప్పాలి.

తాజాగా చోటు చేసుకున్న ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ నేతల్లో కొత్త గుబులు పుట్టిస్తోంది. కొరివితో తల గోక్కున్నట్లుగా.. 50వేల మంది ఉద్యోగుల్ని తీసివేస్తున్న రీతిలో ముఖ్యమంత్రి ప్రకటన ఉండటం.. ఈ ఇష్యూను మరింత పెద్దది అయ్యే ఛాన్స్ ను కేసీఆర్ స్వయంగా ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. తాజా ఉద్యమం పుణ్యమా అని కొత్త నాయకత్వం పుట్టుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇప్పుడు పవర్లో ఉన్న వారిలో చాలామంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారే. ఉద్యమం పుణ్యమా అని.. మార్పును గుర్తించని చాలామంది రాజకీయ నేతలు తమ భవిష్యత్తుకు మరణశాసనం రాసుకున్నారు. ఉద్యమంలో ఉన్న గొప్పతనం అదే. ప్రారంభమైనప్పుడు ఎవరికి పట్టదు. పెద్ద ఎత్తున సాగుతున్నప్పుడు ఒత్తిళ్లు.. కష్టాలు ఎక్కువ. అలాంటి వాటిని భరించిన వారందరికి తర్వాతి కాలంలో పెద్ద పదవులు దక్కుతాయి.

ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని చూసినోళ్లంతా ఇవే విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. సమ్మె వ్యవహారం తీవ్ర రూపం దాలిస్తే.. కొత్త నాయకత్వం పుట్టుకు వస్తుందని.. వారంతా తమకు ఫ్యూచర్ ను దెబ్బ తీసే వారంటున్నారు. అలా అని.. వారిని ఆపే శక్తి తమకు లేదని.. అలాంటి అవకాశం లేకుండా చేయటానికి తమ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్న ధోరణి తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళనను గులాబీ నేతలు పలువురు గుట్టుచప్పుడు చేయని రీతిలో తమ అభిప్రాయాల్ని పంచుకోవటం కనిపిస్తోంది.
Tags:    

Similar News