500 కి మీ ఛేజ్ చేసి మరీ ఆ సూపర్ దొంగను పట్టేసిన పోలీసులు

Update: 2023-04-15 09:36 GMT
దొంగల్లో చాలానే రకాలు ఉంటాయి. దొంగల పేరుతో తీసిన సినిమాల్లోనూ జేబు దొంగ.. మంచిదొంగ ఇలాంటి పేర్లతో తీయటం తెలిసిందే.  ఇప్పుడు చెప్పే దొంగ కాస్తంత స్పెషల్ దొంగ. ఇతగాడి క్రేజ్ ఎంతంటే.. అతడి తీరును ఆధారంగా చేసుకొని బాలీవుడ్ లో పదిహేనేళ్ల క్రితం ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ పేరుతో ఒక సినిమాను కూడా తీశారు. ఇంతకూ అతగాడి ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతాడు. ఇంతకీ అతని పేరేమిటి? అంటారా? బంటి అలియాస్ దేవేంద్ర సింగ్. సూపర్ చోర్ గా అనికి ప్రత్యేకమైన బిరుదు కూడా ఉండటం గమనార్హం.

దొంగే అయినా.. రోటీన్ తరహాలో చోరీలు చేయటం అతనికి ఇష్టం ఉండదని చెబుతారు. అతడి లక్ష్యం చాలా క్లియర్ గా ఉంటుంది. ఖరీదైన కార్లను మాత్రమే దొంగలిస్తాడు. లక్షలాది రూపాయిలు విలువ చేసే వాచీలనే ఇష్టపడతాడు. వాటినే కొట్టేస్తాడు. బంగారం.. వజ్రాలకే ప్రాధాన్యత తప్పించి.. వెండి లాంటి తక్కువ విలువ ఉన్న వాటి మీద ఫోకస్ చేయడు. ఢిల్లీలోని వికాస్ పురికి చెందిన ఇతను తొమ్మిది తరగతి ఫెయిల్ అయ్యాడు.

దీంతో.. అతడి తండ్రి అతన్ని మందలించే క్రమంలో కొట్టటంతో.. ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పటినుంచి దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటాడు. 14 ఏళ్ల వయసులో చోరీలు షురూ చేసి గడిచిన 30 ఏళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్ని టార్గెట్ చేశాడు. హిందీ బిగ్ బాస్ 4లో పోటీదారుగా వ్యవహరించిన ఈ సెలబ్రిటీ దొంగ మీద ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బోలెడన్ని కేసులు ఉన్నాయి. అతడ్ని అరెస్టు చేసిన ప్రతిసారీ అతని వద్ద నుంచి భారీగా బంగారం.. నగదు.. విలువైన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఈ మధ్యన ఒక సారి తన ఫ్యామిలీ మెంబర్లను కలిసేందుకు ఇంటికి వెళ్లగా.. వారు అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు.

ఈ కరుడుగట్టిన దొంగను తాజాగా పట్టుకునేందుకు భారీ ప్లాన్ వేయాల్సి వచ్చింది ఢిల్లీ పోలీసులు. అతడ్ని అదుపులోకి తీసుకోవటం కోసం దాదాపు 500కి.మీ. ఛేజ్ చేసి మరీ అతడ్ని అరెస్టు చేవారు. అత్యంత విలువైన వస్తువుల్ని మాత్రమే దొంగలించే అలవాటు ఉన్న అతడు.. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలోనే బస చేయటం అతనికో అలవాటు కావటం మరో విశేషం.

Similar News