కేసీఆర్ డిసైడ్ అయ్యారు.. అప్పు తెచ్చైనా వైద్యం చేయిస్తారట

Update: 2021-05-25 03:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఒక విలక్షణత ఉంటుంది. కొన్ని కీలక విషయాల్లో తనకు సంబంధం లేనట్లుగా ఉంటారు. కానీ.. ఏదో ఒక పాయింట్లో ఆయనలోని ‘అందరివాడు’ నిద్ర లేస్తాడు. అప్పటివరకు తనకు పట్టనట్లుగా.. అంటీముట్టనట్లుగా ఉండే ఆయన ఒక్కసారిగా మారిపోతారు. ఐడియల్ గా ఆలోచించటం షురూ చేస్తారు. నిజానికి ఈ తీరే కేసీఆర్ బలంగా చెప్పాలి. తప్పుల మీద తప్పులు చేస్తూ అందరి చేత తిట్లు తినే ఆయన.. తన ఇమేజ్ ను ఎలా కాపాడుకుంటున్నారంటే.. దానికి కారణం ఆయనలోని విలక్షణతే కారణంగా చెప్పాలి.

కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి పది రోజుల క్రితం వరకు కేసీఆర్ స్పందించే తీరుకు.. ఇప్పటికి ఏ మాత్రం పోలిక కనిపించదు. స్వయంగా సీన్లోకి రావటమే కాదు.. గాంధీ.. వరంగల్ ఎంజీఎంను సందర్శించటం.. కరోనా రోగులకు అతి దగ్గరగా వెళ్లటంతో పాటు.. వారి కష్టాల్ని.. వేదనల్ని తెలుసుకున్న తర్వాత.. కరోనా తీవ్రత అర్థమయ్యాక ఆయనలో మార్పు మొదలైంది. కేసీఆర్ లో ఉన్న మరో గుణం ఏమంటే.. అప్పటివరకు పట్టనట్లుగా ఉండే వ్యక్తి.. ఒకసారి ఆ విషయం మీద ఫోకస్ చేయటం మొదలుపెడితే.. దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు.

కరోనా.. బ్లాక్ ఫంగస్ వైద్యానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా అటు ఏపీ.. ఇటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు పోటెత్తుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. ఒకదశలో వారిని ఆపేయటం.. హైకోర్టు జోక్యంతో అంబులెన్సుల్ని వదిలేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వైద్యం అందించటం కష్టమే అయినప్పటికి.. దాన్ని సమర్థంగా చేపడితే వచ్చే మైలేజీని సీఎం కేసీఆర్ గుర్తించినట్లు కనిపిస్తోంది.

దీనికి ఆయన మాటల్లో వచ్చిన తేడానే నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు.. ఏపీ నుంచి వచ్చే తాకిడిని తట్టుకునేలా ప్లానింగ్ చేయాలని ఆయన ఆదేశించటం గమనార్హం. కరోనా.. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారని.. తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లే కానీ కరోనా చికిత్స విషయంలో పది కోట్లుగా అంచనా వేయాలని ఆయన తేల్చి చెప్పటం చూస్తే.. ఆయన మాటలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా చికిత్స అందించక తప్పేట్లు లేదని.. కరోనా కట్టడి ప్రథమ ప్రాధాన్యతగా మార్చుకోవాలని.. అందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పు తెచ్చి అయినా వైద్యం చేస్తానని స్పష్టం చేయటం చూస్తే.. కరోనా ఎపిసోడ్ లో కేసీఆర్ లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News