నిరసనకారులకు జనగణమణతో చెక్ పెట్టారు

Update: 2019-12-20 05:04 GMT
ఆందోళనలు.. నిరసనలు అన్నంతనే పోలీసులకు ఆందోళకారులకు మధ్య ఎలాంటి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పటికే తీవ్ర ఒత్తిడి.. పెద్ద సమూహాన్ని కంట్రోల్ చేయటానికి కిందా మీదా పడుతున్న వేళ.. ఏ చిన్న ఘటన జరిగినా పరిస్థితి మొత్తం చేజారి పోతుంది. మాబ్ ను కంట్రోల్ చేయటం సాధ్యమయ్యే పని కాదు.

ఉవ్వెత్తున ఎగిసిపడే నిరసన జ్వాలల్ని చల్లార్చేందుకు చాలా సందర్భాల్లో పోలీసులు చేసే ప్రయత్నాలు విమర్శలు వెల్లువెత్తేలా చేయటమే కాదు.. ప్రభుత్వాల్ని ఇరుకున పడేసేలా చేస్తుంటాయి. కేంద్రప్రభుత్వం ఇటీవల చట్టం చేసిన పౌరసత్వ సవరణతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయి.

తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇలాంటివేళ.. నిరసనకారుల్ని దారికి తెచ్చేందుకు లాఠీ చార్జ్ నో.. బాష్పవాయువునో కాకుండా.. జాతీయగీతాన్ని ఆయుధంగా వాడుకున్న ఒక పోలీసు ఉన్నతాధికారి తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించిన కేంద్రం తీరును తప్పు పడుతూ బెంగళూరులో పెద్ద ఎత్తున నిరసనల్ని నిర్వహించారు. వందలాదిగా చేరిన ఆందోళనకారుల్ని శాంతింపజేసేందుకు బెంగళూరు డీసీపీ అనూహ్యంగా వ్యవహరించారు. ఆందోళనకారుల్ని వెనక్కి పంపేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు.

అప్పటివరకూ ఆగ్రహంతో ఉన్న వారంతా.. జాతీయ గీతాన్ని ఆలపించటం షురూ చేసినంతనే.. తమ నిరసనల్ని పక్కన పెట్టేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జైహింద్ తర్వాత.. తన నిరసనలను ఆపేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. భారీ నిరసనను జాతీయ గీతాన్ని ఆయుధంగా చేసుకొని కంట్రోల్ చేసిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News