వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చిన రాయపాటి కంపెనీ

Update: 2020-01-02 04:35 GMT
తవ్వే కొద్దీ బయట కు వచ్చే కొన్ని ఉదంతాల్ని చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్టర్ గా.. ప్రమోటర్ ఛైర్మన్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన రుణాల ఎగవేత వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి షాకులిస్తున్నాయి. ఈ కంపెనీ చెల్లించాల్సిన రుణాల జాబితా భారీగా ఉండటమే కాదు.. ఇన్ని వేల కోట్లు బ్యాంకులు అప్పులు ఇచ్చాయా? అన్న సందేహం కలుగక మానదు.

దాదాపు ఆరేళ్ల క్రితం.. అంటే 2013లో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు పొందిన ట్రాన్స్ ట్రాయ్ ఆ తర్వాత తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదు. పోలవరం హెడ్ రెగ్యులేటరీ వర్కస్ తో పాటు ఇతర అభివృద్ధి పనులు చూపించి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో ఏకం గా రూ.8800 కోట్ల రుణాల్ని పొందటం గమనార్హం. ఈ కంపెనీ చరిత్రను చూస్తే.. రోడ్లు.. ఇరిగేషన్ ప్రాజెక్టులను విజయ వంతంగా పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. మిగిలిన రంగాల్లో ఇప్పటివరూ పూర్తి చేసిన పనులు కనిపించవు.

ట్రాన్స్ ట్రాయ్ కు అప్పులు ఇచ్చిన బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకుగా ఉంది. ఇది రూ.990 కోట్ల నిధుల్ని రుణాలుగా ఇచ్చింది. అయినప్పటికీ తిరిగి చెల్లించే విషయంలో ట్రాన్స్ ట్రాయ్ ఆలస్యం చేస్తుందని చెబుతున్నారు. బ్యాంకులు తామిచ్చిన రుణాల్ని రికవరీ చేసుకునేందుకు 2015 నుంచి ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేదన్న మాట వినిపిస్తోంది. తామిచ్చిన రుణాల్లో రూ.264 కోట్ల మొత్తాల్ని వేరే ఖాతాలకు మళ్లించినట్లు గా యూనియన్ బ్యాంకు వెల్లడించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్ గతంలో పలు దేవాలయాలకు భారీ ఎత్తున కానుకల్ని సమర్పించేవారు. 2012లో తిరుచానూరు పద్మావతి అమ్మ వారికి ఏకంగా రూ.4.33 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి వజ్రాలు.. పగడాలు పొదిగిన బంగారు చీరను తిరుచానూరు అమ్మ వారికి కానుకగా ఇవ్వటం అప్పట్లో సంచలనం గా మారింది. అప్పు చేసి పప్పుకూడు అన్నట్లు గా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఇలా గుళ్లకు భారీ కానుకలు ఇచ్చుడేందంటారు?
Tags:    

Similar News