టీడీపీకి ఆ మాజీ ఎమ్మెల్యే దంప‌తుల రాజీనామా!

Update: 2022-08-19 12:30 GMT
గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒకేసారి ఏక‌కాలంలో వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా  భార్యాభ‌ర్త‌లు సీతా ద‌యాక‌ర్‌రెడ్డి, కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి ఒక అరుదైన రికార్డు సృష్టించారు. 1999లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కొత్త‌కోట దయాక‌ర్‌రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని మ‌క్త‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అలాగే ఆయ‌న భార్య సీతా ద‌యాక‌ర్‌రెడ్డి అదే జిల్లా దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యేగా టీడీపీ త‌ర‌ఫున ఉన్నారు. ఇలా ఈ దంప‌తులిద్ద‌రూ అరుదైన రికార్డు సృష్టించారు.

ఇప్పుడు వీరిద్ద‌రూ టీడీపీకి రాజీనామా ప్ర‌క‌టించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి తెలంగాణ‌లో టీడీపీ అసలుకు ఏమాత్రం అవ‌కాశం లేక‌పోయినా ఇప్ప‌టివ‌ర‌కు ద‌యాక‌ర్‌రెడ్డి దంప‌తులు ఏ పార్టీలోకి వెళ్ల‌కుండా టీడీపీలోనే కొన‌సాగారు. అయితే ఎట్ట‌కేల‌కు పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

రానున్న దసరా పండుగ పర్వదినం నుంచి తాను జనంలోకి వెళ్లనున్నట్లు మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్రలో తన జన్మదిన వేడుకల సందర్భంగా అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నానని కంట‌త‌డి పెట్టారు. త్వరలోనే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

దేవరకద్ర, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల‌ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుని సరైన  మార్గంలో వెళ్తానని స్ప‌ష్టం చేశారు. ఇతర పార్టీలోను తనను అభిమానించే నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. కాగా కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి సీతా దయాక‌ర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News