సినిమా థియేటర్ల విషయంలో చైనాలో ఆ ట్రెండ్ నడుస్తోందట

Update: 2022-09-28 05:02 GMT
మనకంటే ఎక్కువ జనాభా. దానికి మించిన సాంకేతికతతో పాటు.. నియంత పాలకుల పడగలో బతుకులు సాగదీసే చైనీయులు.. సినిమా థియేటర్లను ఆదరిస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మిగిలిన దేశాలకు భిన్నంగా చైనాలో ఇటీవల కాలంలో సినిమా థియేటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయిన ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు సమాచార.. ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్వి అపూర్వ చంద్ర. ఓవైపు మన దేశంలో ఉన్న సినిమా హాళ్లు అంతకంతకూ తగ్గిపోతున్న వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఒకప్పటి సినిమా థియేటర్లతో పోలిస్తే.. ఇటీవల కాలంలో సైజులు తగ్గిపోతూ.. స్క్రీన్లను పెంచుతున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ ట్రెండ్ కు భిన్నమైన ట్రెండ్ చైనాలో నడుస్తోంది. ఐదారేళ్ల క్రితం భారత్ లో 12 వేల థియేటర్లు ఉంటే.. ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య 8 వేలకు తగ్గిపోయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో.. చైనాలో మాత్రం రివర్సు ట్రెండ్ నడుస్తోందని పేర్కొన్నారు.

గడిచిన ఐదేళ్లలో చైనాలో సినిమా థియేటర్ల సంఖ్య 10 వేల నుంచి ఏకంగా 70 వేలకు పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో భారతీయ సినిమాలు పెద్ద ఎత్తున చైనీస్ లో డబ్ అవుతూ విజయవంతంగా ప్రదర్శిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

అప్పుడెప్పుడో కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన సక్సెస్ మూవీల్ని చైనీస్ భాషలో అనువదిస్తూ.. ప్రదర్శిస్తున్నారు. దీంతో.. భారత సినిమా ఇప్పుడా దేశంలో వెలిగిపోతున్నట్లు చెబుతున్నారు. మన దేశంలోనూ చైనాలో మాదిరి పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో 10 లక్షల జనాభా ఉన్న మాల్డాలో ఒక్క థియేటర్ కూడా లేదన్న విషయాన్ని మర్చిపోకూదంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని కొన్ని జిల్లా కేంద్రాల్లో ఆరు థియేటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీనికి తోడు.. ఆ థియేటర్లలో రూ.75 టికెట్ పెట్టగా.. అది సూపర్ హిట్ కావటం.. పెద్ద ఎత్తున బుకింగ్ లు చోటు చేసుకున్న విషయాన్ని గుర్తించారు.

కర్ణాటకలోని జిల్లాకేంద్రాల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తే.. చైనాలో మాదిరి మన దేశంలోనూ థియేటర్ల సంఖ్య పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News