సీఎం జగన్ ఇంటి దగ్గర్లో రెచ్చిపోయిన దొంగలు!

Update: 2022-05-31 09:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గర్లో  ఒక దారుణం చోటు చేసుకుంది. పోలీసుకానిస్టేబుల్ అయిన తన కొడుకుతో కలిసి బండి మీద వెళుతున్న మహిళ మెడలో గొలుసును తెంచే ప్రయత్నంలో ఆమె జారి కిండపడిపోవటం.. తీవ్ర గాయాలు కావటం.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం నివాసానికి దగ్గర్లోనే ఇలాంటి దారుణం చోటు చేసుకోవటం.. ఘటన జరిగిన మూడు రోజులు అవుతున్నా నిందితుల్ని అదుపులోకి తీసుకోకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు.

నిఘా వైఫల్యంతో పాటు.. దారుణ ఘటన జరిగిన తర్వాత అయినా పోలీసులు చురుగ్గా స్పందించి ఉంటే నిందితుల్ని పట్టుకునే వారు కదా? అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

విజయవాడ ఏసీబీ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శివ.. అతని తల్లి జయమ్మ ఇతర కుటుంబ సభ్యులు మంగళగిరి పానకాల స్వామి దర్శనానికి బైకు మీద వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు వీరి బైకును దుండగులు ఫాలో అయ్యారు.

యర్రబాలెం వద్ద అప్కో రాష్ట్ర కార్యాలయం వద్దకు వచ్చిన వెంటనే జయలక్ష్మీ మెడలో నుంచి బంగారు గొలుసును లాగేశారు. ఈ ధాటికి ఆమె బైకు మీద నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో ఆమెను దగ్గర్లోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న ఆమె మూడు రోజుల అనంతరం మరణించారు. ఇదిలా ఉంటే గొలుసు దొంగల్ని పట్టుకునే విషయంలో మూడు రోజులైనా వారిని గుర్తించకపోవటాన్ని తప్పు పడుతున్నారు. సీఎం నివాసానికి దగ్గర్లో జరిగిన దారుణ ఉదంతాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News