కేసీఆర్ మళ్లీ గెలిచే సెంటిమెంట్ ఇదేనా?

Update: 2022-07-26 06:03 GMT
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను పక్కనపెట్టి రెండు సార్లు తెలంగాణలో టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై దయతలచలేదు. దీనంతటికి కారణం కేసీఆర్. ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సెంటిమెంట్ రాజేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని.. ఇచ్చేలా టీఆర్ఎస్ పోరాడిందని.. కాంగ్రెస్ ను అష్టదిగ్భంధనం చేసి ఇప్పించేలా చేసిందన్న భావనను కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారు.. విజయవంతమయ్యారు. అదే ఆయన గెలుపు సీక్రెట్ గా మారింది. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడు ఎక్కడ.. ఎలా వాడాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే.. ఈ కొత్త రాష్ట్రానికి ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు కన్నీళ్లు చూసిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అయితే బాగుంటుందని.. బాగుపడుతుందని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. దీంతోపాటు అభివృద్ధి కోణాన్ని కూడా కేసీఆర్ చూపించారు. తెలంగాణ ప్రజలను ఆకర్షించారు. ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ కు పునాదులైన 'నిధులు, నీళ్లు, నియామకాలు'ను తెరపైకి తెచ్చారు. ఈ తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి టీఆర్ఎస్ గెలిచింది.

ఇక సెకండ్ టైం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ సూపర్ విక్టరీ కొట్టారు. మొదటిసారి మ్యాజిక్ మార్క్ వరకే సీట్లు వస్తే.. రెండోసారి ఏకంగా 80కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి బంపర్ విక్టరీ కొట్టాడు. దీనికంతటికి కారణంగా కాంగ్రెస్ తో చంద్రబాబు కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయడమే.. ఆంధ్రా బాబు తెలంగాణలో పాలనకు వస్తున్నాడని.. కాంగ్రెస్ అపవిత్ర పోత్తును ఓడించాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. చంద్రబాబుపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను కాల్చేశాడు కేసీఆర్. తెలంగాణ వచ్చాక కూడా ఇక్కడ ఆంధ్రుల పెత్తనం అవసరమా? అన్న దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది వర్కవుట్ అయ్యి 2018లో టీఆర్ఎస్ కు ఘన విజయం దక్కింది.

ఇక ముచ్చటగా మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.  రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ పై ప్రబలంగా ఉంది. పైగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పుంజుకుంది , బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది. ఈసారి కెసిఆర్ మీద గెలవడానికి కాంగ్రెస్ - బీజేపీ కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి . అందుకే ఈసారి ఎలాంటి సెంటిమెంట్ తో గెలవాలన్నది కేసీఆర్ ప్రిపేర్ చేస్తున్నారు.

రెండు సార్లు తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. ఈసారి తెలంగాణకు ప్రతీ విషయంలో అన్యాయం చేస్తూ నిధులు, విధుల్లో ఆటంకాలు కలిగిస్తున్న బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మోడీ తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని పేదరికంలోకి మగ్గేలా చేస్తున్నాడన్న వాదనను తెరపైకి తెచ్చి ప్రాంతీయ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

మోడీని, బీజేపీని కొట్టాలంటే అంతకుమించిన అస్త్రం లేదని కేసీఆర్ భావిస్తున్నాడు. అందుకే బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే ఆంధ్రాలో కలిసిన 5 గ్రామాల విలీనం అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడట.. ఇలా టీఆర్ఎస్ వాళ్లు తమ కొత్త అస్త్రం కోసం ఇప్పుడు శూలశోధన చేస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News