అవినీతిపై ఉక్కుపాదమంటే ఇలాగే ఉండాలి

Update: 2022-02-03 04:36 GMT
మనదేశంతో డ్రాగన్ సంబంధాలు ఎలాగున్నా, అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే అవినీతి నియంత్రణ విషయంలో మాత్రం చైనా ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవినీతి నియంత్రణ విషయంలో జిన్ పింగ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతిని కంట్రోల్ చేయటంలో డ్రాగన్ కు మన దేశానికి మధ్య తేడా స్పష్టంగా తెలిసిపోతోంది. మనదేశంలో బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుని దర్జాగా దేశం వదిలి వెళ్ళిపోతున్నారు.

మరి కొంతమందైతే దేశం వదలకుండా మన ముందే హ్యాపీగా తిరిగేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరిపోయి పునీతులైపోతున్నారు. ప్రతిపక్షాల్లో ఉన్నపుడు వీళ్ళపై జరిగిన దాడులు ఇపుడు మచ్చుకి కూడా కనపడటం లేదు. సరిగ్గా ఇలాంటి వాళ్ళ విషయంలోనే డ్రాగన్ ప్రభుత్వం కొరడా పట్టుకుని తిరుగుతోంది. ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారిని ముక్కు పిండి మరీ దేశంలోకి లాక్కొస్తోంది.

వివిధ ఆర్ధిక సంస్ధలు, బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు తీసుకుని చైనాలోని కొందరు కుబేరులు 120 దేశాలకు పారిపోయారు. అలాంటి వాళ్ళ అడ్రస్సులు సంపాదించి ఆ దేశాలతో మాట్లాడి 8300 మందిని చొక్కాలు పట్టుకుని చైనాకు తిరిగి లాక్కొచ్చింది. ఒకసారి చైనాకు లాక్కొచ్చిన తర్వాత వాళ్ళ నుండి అప్పులు తిరిగి రాబట్టడంతో పాటు చేసిన నేరానికి తగిన శిక్షను విధించటంలో  ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 వివిధ మార్గాల్లో సేకరించిన అవినీతిపరుల చిట్టా ప్రకారం సుమారు 200 మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరిలో 50 మందికి పైగా సైనిక అధికారులు కూడా ఉండటం గమనార్హం. గడచిన పదేళ్ళల్లో వివిధ మంత్రిత్వ శాఖల్లో అవినీతి ఆరోపణలపై 400 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం అరెస్టు చేసి విచారణ జరిపింది. ఒకసారి అరెస్టు, విచారణ, శిక్షలంటే చైనాలో ఎంత స్పీడుగా జరిగిపోతుందో తెలిసిందే. మనదగ్గర వేల కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్ళల్లో ఒక్కళ్ళని వెనక్కి తెప్పించాలంటే మన ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. ఈ విషయంలో మనకు డ్రాగన్ కు ఎంత తేడా కనబడుతోందో.

    

Tags:    

Similar News