'మంగళ్ యాన్' కథ ముగిసింది.. బ్యాటరీ డ్రైన్.. ఎందుకిలా?

Update: 2022-10-03 04:01 GMT
భారత అంతరిక్ష ప్రయోగాలు ప్రతి ఒక్కటి ఒక్కో అగ్నిపరీక్ష. చాలీచాలని నిధులు.. బయటకు చెప్పుకోలేని ఎన్నో సంస్థలు.. వీటికి మించి అరకొర సాంకేతిక సహకారం.. వీటికి తోడు అంతర్గత రాజకీయాలు.. ఇలాంటి పరిస్థితుల్లోనూ పలు ప్రయోగాల్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. విజయ పథాన నడిచే ఘనత ఇస్రో సొంతమని చెప్పాలి. అనూహ్య పరిస్థితుల్లో మొదలైన మిషన్ మంగళ అలియాస్ మంగయాళ్ ప్రయోగం విజయవంతం కావటం.. అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఇంతటి భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఈ ప్రయోగ నేపథ్యంతో ఇప్పటికే పలు సినిమాలు రావటం తెలిసిందే.

వీటిల్లో బాలీవుడ్ మూవీ మిషన్ మంగళ పెద్ద సక్సెస్ సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ప్రయోగానికి పెట్టిన ఖర్చు రూ.450 కోట్లు అయితే.. ఈ అద్భుత ప్రయోగ నేపథ్యంలో.. అందులో కీలకభూమిక పోషించిన సైంటిస్టుల జీవితాలతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో మంగళ్ యాన్ ప్రయోగం మొదటి వరుసలో నిలుస్తుంది. అతి తక్కువ బడ్జెట్ తో.. అంచనాలకు మించి పని చేసే ఉపగ్రహాన్ని తయారు చేసిన ఘనత భారత్ సొంతమైంది.

2013 నవంబరు 5న పీఎస్ఎల్ వీ -సి25 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా మార్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ వ్యోమ నౌక అప్రతిహతంగా తన సేవల్ని అందిస్తూనే ఉంది. నిజానికి ఈ ఉప గ్రహాన్ని కేవలం ఆరు నెలల వరకు మాత్రమే పని చేసేలా తయారు చేశారు. అలాంటిది అందుకు భిన్నంగా ఏడున్నరేళ్ల పాటు ఈ ఉపగ్రహం పని చేయటం విశేషం.

నిజానికి ఇప్పటికి ఈ ఉపగ్రహం పని చేసే అవకాశం ఉంది. కానీ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఉపగ్రహం పని చేయని పరిస్థితి నెలకొంది. సూర్య కాంతితో వీటి సోలార్ ప్యానళ్లు రీఛార్జ్ అయ్యేలా దీన్ని రూపొందించారు. అయితే.. పలు సందర్భాల్లో సూర్య కాంతి లభించని గ్రహణం దశల్ని తప్పించుకోవటానికి ఈ వ్యోమ నౌకను పలుమార్లు కక్ష్య మారుస్తూ ఉండేవారు. ఫలితంగా ఇందులోని ఇంధనం ఖర్చు అయ్యింది.

అయితే.. ఇటీవల కాలంలో వరుసగా గ్రహణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఇందులో ఒకటి ఏడున్నర గంటల పాటు సాగే సుదీర్ఘ గ్రహణం కూడా ఉంది. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం గంటన్నర మాత్రమే తట్టుకునేలా ఉపగ్రహ బ్యాటరీని రూపొందించారు. అంతకంటే ఎక్కువ సమయంలో సూర్యకాంతి లభించకుంటే బ్యాటరీ చార్జింగ్ డ్రైన్ అయిపోయే ప్రమాదం ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఏడున్నర గంటల గ్రహణ పరిస్థితుల్లో బ్యాటరీ డ్రెయిన్ అయిపోయింది.దీంతో మంగళ్ యాన్ తో సంబంధాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఆర్నెల్లు పని చేయాల్సిన ఉప గ్రహం ఏకంగా ఎనిమిదేళ్లు పని చేయటం ఒక విశేషమని చెప్పాలి. ఇక.. తన జీవితకాలంలో అత్యద్భుత సేవల్ని మంగళ్ యాన్ అందించింది. అంగారకుడికి సంబంధించిన 8 వేలకు పైగా ఫోటోల్ని పంపటంతో పాటు.. అంగారక గ్రహం అట్లాస్ ను అందించింది. ఒక భారీ మూవీ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చు పెట్టి నిర్మించిన మంగళయాన్ సేవలు ముగిసే నాటికి మరో ఉపగ్రహ పరీక్షను నిర్వహించి ఉండాల్సింది. కానీ.. భారత సర్కారు ఆ దిశగా అడుగులు వేయకపోవటం గమనార్హం. ఇకపై.. మంగళ్ యాన్ ఉప గ్రహం అన్నది ఒక గతం.. ఒక చరిత్ర. అదెప్పుడూ భారతీయులకు మరింత గర్వాన్ని కలిగించిన ప్రయత్నంగా మాత్రం మిగులుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News