ఏపీ సీఎం జ‌గ‌న్‌పై కేసు.. తేల్చేస్తామ‌న్న‌ సుప్రీం కోర్టు

Update: 2022-11-18 09:30 GMT
సుమారు ఏడాదిన్న‌ర కింద‌ట ఏపీ సీఎం జ‌గ‌న్‌.. అప్ప‌టికి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  రేసులో ఉన్న జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌పై కొన్ని ఆరోప‌ణ‌లు చేస్తూ రాసిన లేఖ విష‌యం గుర్తిందిక‌దా! అప్ప‌ట్లో ఇది సంచ‌ల‌నం సృష్టించింది. సుప్రీంకోర్టు అప్ప‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌ను వెంట‌నే మీడియాకు సైతం విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అయితే, దానిని అప్ప‌ట్లో ప‌క్క‌న పెట్టారు. అయితే, ఏపీ సీఎం ఒక న్యాయ‌మూర్తిపై ఇలా ఆరోప‌ణ‌లు చేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ కొంద‌రు సుప్రీం కోర్టులో రిట్ పిటిష‌న్‌దాఖ‌లు చేశారు. దీనిలో కొంద‌రు కీల‌క న్యాయ‌వాదులు కూడా ఉన్నారు. వీరంతా వేసిన రిట్ పిటిష‌న్ల‌ను విచారించి.. తేలుస్తామ‌ని తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించారు.

వ్యక్తిగతంగా హాజరైన పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్, న్యాయమూర్తులు ఎం.ఆర్.షా, ఎం.ఎం.లతో కూడిన ధర్మాసనానికి ఈ కేసు గురించి వివ‌రించారు.  "ఇది ఒక పేజీ రిట్ పిటిషన్, దీనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి(జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌)పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని నేను చెబుతున్నాను." అని పిటిషనర్ వివరించారు.

"అక్టోబర్ 6 న, భారత ప్రధాన న్యాయమూర్తికి  సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. అక్టోబర్ 10 న, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు విలేకరుల సమావేశంలో ప్రసంగించారు, అక్కడ ఈ లేఖను బ‌హిర్గ‌తం చేశారు.  మరుసటి రోజు, అక్టోబర్ 11న, అది అన్ని ఆంగ్ల, ప్రాంతీయ భాషా వార్తాపత్రికలలో ప్రచురించారు.   అదే రోజు, నేను ఈ చిన్న రిట్ పిటిషన్‌ను దాఖలు చేసాను." అని వివ‌రించారు.

"ఇలా ఒక న్యాయ‌మూర్తిపై ఆరోప‌ణ‌లు చేసి, ఆ లేఖ‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డం ప్రజలపై ప్ర‌భావం చూపిస్తుంది. ప్రజాస్వామ్య సమాజంలో న్యాయస్థానం ప్రజల్లో స్ఫూర్తిని నింపాల్సిన విశ్వాసమే ప్రమాదంలో ఉంది. ఈ పద్ధతిని అనుమతించకూడదు" అని నొక్కిచెప్పారు.

దీనిపై స్పందించిన ధ‌ర్మాస‌నం.. ఈ విషయాన్ని "డీ-ట్యాగ్" చేసి డిసెంబర్ 12న జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. "అయితే, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఎలాంటి నోటీసు జారీ చేయడం లేదు" అని జస్టిస్ షా స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News