జగన్, పెద్దిరెడ్డి ప్రతిష్ట.. అందుకేనా ఎస్ఈసీ బ్రేక్

Update: 2021-02-06 16:30 GMT
ఎస్ఈసీ నిమ్మగడ్డకు, వైసీపీ సర్కార్ మధ్యనున్న పంచాయతీ చివరకు గుంటూరు, చిత్తూరు జిల్లాలపై పడింది. ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాల విషయంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనే ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రెండు జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చే నివేదికలు, వాటిని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుంటారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ ఎత్తున పంచాయతీలు ఏకగ్రీవంగా మారిన నేపథ్యంలో వాటిపై విచారణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ విచారణకు ఆదేశించారు. అప్పటివరకూ సదరు పంచాయతీల ఫలితాలను నిలిపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటికే ఆయా పంచాయతీల్లో ఏకగ్రీవాలపై విచారణ జరుగుతోంది. ఇందులో అధికారులు సహకరించినట్లు తేలితే వారిపైనా చర్యలు తప్పవని ఎస్ఈసీ హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పుడు ఈ పంచాయతీల్లో ఏకగ్రీవాలు కరెక్టేనని చెబితే ఎస్‌ఈసీ ఏమంటారో, కాదని చెబితే ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. అందుకే జాగ్రత్తగా ఏకగ్రీవాలను విశ్లేషించే పనిలో వారు నిమ్మగ్నమయ్యారు.

గుంటూరు, చిత్తూరు జిల్లాలో అత్యధిక పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై ఎస్ఈసీ అధికారులతో విచారణ ప్రారంభించిన తరుణంలో రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లకు ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.

ఎస్ఈసీ మాట విని ఏకగ్రీవాలపై ఏకపక్ష చర్యలు తీసుకుంటే నిమ్మగడ్డ రిటైర్‌ అయ్యాక మీపై చర్యలు తప్పవంటూ పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి బహిరంగంగానే వారిని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారబోతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఇప్పుడే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటారు, వినకపోతే ప్రభుత్వం తర్వాత చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారుల పాత్ర కీలకంగా మారింది




Tags:    

Similar News