కాళేశ్వరం విషయంలో కేసీయార్ కు గ్రీన్ ట్రైబ్యునల్ షాక్

Update: 2020-10-20 12:49 GMT
కేసీయార్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) పెద్ద షాకే ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణా ప్రభుత్వం అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోలేదని స్పష్టంగా ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణం అనుమతులపై ఎన్జీటీలో చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే సమయంలో ఫిర్యాదులపై ట్రైబ్యునల్లో విచారణ కూడా జరగుతోంది. సుదీర్ఘ విచారణల తర్వాత మంగళవారం ట్రైబ్యునల్ తన తీర్పును చెప్పింది.

ఈ తీర్పులో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఎటువంటి అనుమతులు ప్రభుత్వం తీసుకోలేదని ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్పేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయిన కారణంగా ఇపుడు చేసేది కూడా ఏమీ లేదని పెదవి విరిచింది. కాకపోతే ఇప్పటికైనా పర్యావరణ అనుమతులను తీసుకుని తీరాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు కడుతున్నపుడు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏమి చేస్తోందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

తన విధులను నిర్వర్తించటంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫెయిల్ అయ్యిందని కూడా ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. 85 వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు మంచినీటి సరఫరా కోసమే అని చెప్పినా తర్వాత ఇరిగేషన్ అవసరాల కోసం కూడా వాడుకునేట్లుగా ప్రభుత్వం డిజైన్ మార్చటంపై మండిపడింది. ప్రాజెక్టు వల్ల చాలా లాభాలే ఉన్నప్పటికీ మానవాళికి, అవసరమైన అనుమతులు తీసుకునే విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాల్సిందేనంటూ స్పష్టంగా ప్రకటించింది.

ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోటుపాట్లను సవరించేందుకు ఏడుగురు సభ్యులతో ఓ కమిటి నియమించాలని కూడా సూచించింది. నెల రోజుల్లోగా కమిటిని ఏర్పాటు చేసి తీసుకవాల్సిన అనుమతుల విషయంలో కసరత్తు చేయాలని గట్టిగా హెచ్చరించింది.
Tags:    

Similar News