థర్డ్ ఫ్రంట్ అసాధ్యమంటున్న రాజకీయ కురువృద్ధుడు

Update: 2022-04-14 05:15 GMT
దేశ రాజకీయాల్లోనే కురువృద్ధుడుగా పేరొందాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన అనుభవం ఇప్పటికీ దేశ రాజకీయాల్లో చాలా మంది వర్ధమాన నేతలు పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే పవార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు లేని ప్రత్యామ్నాయ ఫ్రంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కావాలని సూచనలు చేశారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ నిజంగా సాధ్యమేనా? అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం.  దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరు.. కేసీఆర్‌కు ప్రియమైన స్నేహితుడు అయిన శరద్ పవార్ దీనిపై కుండబద్దలు కొట్టారు. దేశంలో 'థర్డ్ ఫ్రంట్' గురించి తన అభిప్రాయాలను  శరద్ పవార్ బయటపెట్టాడు..

ముంబైలో శరద్ పవార్ మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా 'థర్డ్ ఫ్రంట్' సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీతో పోరాడాలంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి కానీ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్‌ను ఊహించలేనని పవార్ అన్నారు.

ఫిబ్రవరిలో కేసీఆర్‌ స్వయంగా ముంబై వెళ్లి పవార్‌తో సమావేశమయ్యారు. 'థర్డ్‌ ఫ్రంట్‌'పై చర్చలు జరిపారు. ఈ భేటీపై పవార్‌ నోరు మెదపకపోయినప్పటికీ చర్చలు ఫలవంతమయ్యాయని కేసీఆర్‌ నమ్మకంగా మీడియాకు చెప్పారు.

కానీ ఇప్పుడు కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. 'థర్డ్‌ ఫ్రంట్' సాధ్యం కాదని అన్నారు. దీంతో ఇప్పుడు కేసీఆర్‌ ఏం చేస్తారని పవార్‌ స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ ఇక పవర్ తో కలవడం కష్టమేనంటున్నారు. దేశంలోని ఇతర జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు చేరువ అవుతారా? అన్నది వేచిచూడాలి.

బీజేపీని ఎదుర్కోవడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ సన్నిహితంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయన స్ట్రాటజీ ప్రకారం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News