తెలుగు విద్యార్థుల కలలు కన్నీళ్లయ్యాయి.. అమెరికాలో విషాదం

Update: 2022-10-28 04:36 GMT
అమెరికాలో భారతీయుల మృత్యుఘోష వినిపిస్తోంది. జాతి వివక్షతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండగా.. ఇప్పుడు రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది అసవులు బాస్తుండడం విషాదం నింపుతోంది. తాజాగా ముగ్గురు యువ తెలుగు విద్యార్థుల మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది.

అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరిలో తెలంగాణకు చెందిన ఒక యువకుడు, యువతి, ఏపీకి చెందిన ఓ యువకుడు ఉన్నారు. మరో నలుగురు తెలుగువాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.

వీకెండ్ కావడంతో స్నేహితులందరూ కలిసి కారులో ట్రిప్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాను, ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. తమ కలలు నెరవేర్చుకుందామని అమెరికా వెళ్లిన విద్యార్థులు ఇలా మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నిండింది.

తెలంగాణలోని వరంగల్ కు చెందిన పావని , హైదరాబాద్ కు చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన సాయినరసింహలు కనెక్టికట్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు.

వీకెండ్ టూర్ కు వెళ్లివస్తుండగా మంగళవారం ఉదయం 6 గంటలకు మినీ వ్యాన్, కారు ఢీకొన్న ప్రమాదంలో మరణించారు. పొగమంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కారులో ఉన్నవారిని అంతర్జాతీయ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు, ఆరుగురు న్యూ హెవెన్ విశ్వవిద్యాలయంలో , ఒకరు సేక్రేడ్ హార్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయినరసింహ బీటెక్ పూర్తి చేసి చెన్నైలోని ప్రముఖ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ సంపాదించాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. దీపావళి జరుపుకొని సోదరితో వీడియో కాల్ కూడా మాట్లాడాడు. ఇంతలోనే టూర్ లో దుర్మరణం చెందడంతో వారింట్లో విషాదం అలుముకుంది. ఇక కడియపులంక గ్రామానికి చెందిన ఎస్ ఐశ్వర్య కూడా ప్రమాదానికి గురైన కారులో ఉంది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News