యుద్ధం ఖ‌రారేః డేట్ డిసైడైంది... బార్డ‌ర్లో టెన్ష‌న్ క‌నిపిస్తోంది

Update: 2022-02-15 08:30 GMT
అంత‌ర్జాతీయంగా రెండు కీల‌క దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. యూఎస్‌ఎస్‌ఆర్‌ మాజీ భాగస్వామి ఉక్రెయిన్‌ను మళ్లీ తనలో కలిపేసుకొనేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం ఆవరించుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని భయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో ఉక్రెయిన్‌ చేరాలనుకోవటం,

దాని వ్యతిరేకిస్తూ రష్యా యుద్ధానికి సిద్ధం కావటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించుకోవచ్చని అమెరికా హెచ్చరించటంతో అనేక దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కు రప్పిస్తున్నాయి. మ‌రోవైపు క‌ష్యా బుధవారం ఉక్రెయిన్‌పై దాడి దిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.

ఉక్రెయిన్ నాటోలో చేర‌డంపై ర‌ష్యా తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా 1.3 లక్షల మంది సైనికులను మోహరించింది. భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తున్నది. దీర్ఘకాలిక యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇటీవల నాటో, పలు యూరప్‌ దేశాలు విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టమైంది. మెరుపు దాడులు చేయగల 25 వేలమంది నౌకాదళ, వైమానిక దళ సైనికులను కూడా సిద్ధంగా ఉంచింది.

ఉక్రెయిన్‌ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొన్న లుహాన్క్స్‌, డొనెస్క్స్‌ రిపబ్లిక్‌లలో రష్యా సైనికులు కనిపిస్తున్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. పొరుగునే ఉన్న మిత్రదేశం బెలారస్‌తో కలిసి రష్యా ఇటీవలే భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీనిపై బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మండిపడ్డాయి. ఇది కచ్చితంగా యుద్ధ సన్నాహకమేనని బ్రిటన్‌ వ్యాఖ్యానించింది.

మ‌రోవైపు ఉక్రెయిన్‌ కూడా యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటోందిది. ఒడెసా ప్రాంతం నుంచి సైన్యాన్ని, ఎస్‌-300 విమాన విధ్వంసక క్షిపణులను డన్‌బాస్‌, బసరిన్‌ ప్రాంతాలకు తరలిస్తోంది. క్రమటోర్క్స్‌ ఎయిర్‌బేస్‌ను జాయింట్‌ ఫోర్స్‌ ఆపరేషన్‌ కమాండ్‌ సెంటర్‌గా మార్చింది. యుద్ధం సంభవిస్తే ఉక్రెయిన్‌ తరఫున రంగంలోకి దిగేందుకు నాటో సిద్ధమవుతోంది. ఇప్పటికే తన బలగాలను ఉక్రెయిన్‌ వైపు తరలించే ఏర్పాట్లు మొదలైనట్టు సమాచారం. రష్యా నుంచి దాడి జరిగితే ఎదుర్కొనేందుకు సరిహద్దులోని ప్రజలకు ఉక్రెయిన్‌ శిక్షణ ఇస్తోంది.

ఉక్రెయిన్‌పై బుధ‌వారం దాడి దిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడమే కాకుండా దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటల్లో తిరిగి రావాలని కోరారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌తో యుద్ధ‌మేఘాలు క‌మ్ముకోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.
Tags:    

Similar News